సినిమా వాళ్ళకు గుడి కట్టటం మనం చూస్తునే ఉంటాం. కానీ రాజకీయ నేతలకు గుడులు కట్టటం మాత్రం అరుదే. ఆ అరుదైన కోవలోకే చంద్రబాబునాయుడు చేరుతున్నారు. రాజకీయ నేత పేరుతో గుడి కట్టటం బహుశా చంద్రబాబుతోనే మొదలవుతోందేమో? ఇంతకీ విషయం ఏమిటంటే, తమ మనసు దోచుకున్న చంద్రబాబుకు రాష్ట్రంలోని హిజ్రాలు గుడి కట్టాలని నిర్ణయించారు. గురువారం నంద్యాలలో హిజ్రాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు.

తమ సంక్షేమం కోసం చంద్రబాబు అమలు చేస్తున్న కార్యక్రమాలతో తామంతా చంద్రబాబు అభిమానులమైపోయినట్లు చెప్పారు. హిజ్రాలకు ఫించన్, రేషన్ కార్డులు, ఇంటి స్ధలాలు పంపిణీ చేయాలని మంత్రివర్గంలో తీర్మానం చేసిన సంగతి అందరకీ తెలిసిందే. అదేవిధంగా కడప జిల్లాలో గృహ నిర్మాణశాఖలో హిజ్రా జానకికి ఉద్యోగం కూడా వచ్చింది. దాంతో హిజ్రాలు పొంగిపోతున్నారు. అందుకే చంద్రబాబుకు గుడికట్టాలని నిర్ణయించారు.

కర్నూలు జిల్లాలోని నంద్యాల నుండి మహానదికి వెళ్ళే మార్గంలో గుడి కట్టటానికి నిర్ణయించినట్లు కూడా చెప్పారు. 5 కిలోల వెండితో చంద్రబాబు నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విగ్రహం ఏర్పాటుకు, గుడి నిర్మాణానికి ఎంత ఖర్చు అయినా వెనక్కు తగ్గేది లేదన్నారు. వివిధ వర్గాల్లో వ్యతిరేకత ప్రబలుతున్న నేపధ్యంలో హిజ్రాలు చంద్రబాబుకు మద్దతుగా నిలవటం గొప్ప విషయమే.