కొంత కాలం పాటు టెలికాన్ఫరెన్స్ లకు  సిఎం విరామం? పార్టీ నేతల సూచనతోనే చంద్రబాబు నిర్ణయం పార్టీ, ఉన్నతాధికారులకు రిలీఫ్

 చంద్రబాబునాయడు టెలికాన్ఫరెన్స్ లకు కొంత కాలం విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నారా? ప్రభుత్వ, పార్టీ వర్గాల ద్వరా అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎడతెరిపిలేకుండా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న టెలికాన్ఫరెన్స్ ద్వారా గంటల కొద్దీ విలువైన సమయం నిస్సారంగా గడచిపోతోంది. ప్రతీ రోజూ చంద్రబాబు సుమారు ఐదు గంటల పాటు వివిధ అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటారు. అందులో ఉన్నతాధికారుల నుండి పార్టీ నేతలు కూడా పాల్గొనాల్సి వస్తోంది.

ప్రతీ రోజు గంటల తరబడి టెలికాన్ఫరెన్ఫులలో మాట్లాడుతుంటే చంద్రబాబుకు ఎలాగుంటున్నదో తెలీదు కానీ మంత్రులు, ఉన్నతాధికారులు, పార్టీ నేతలు మాత్రం విసిగిపోతున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల్లో అయితే మరీ విసుగు పెరిగిపోయింది.

తమ ఇళ్ళలో కూర్చునే వారు టెలికాన్పరెన్సులలో పాల్గొంటున్న కారణంగా స్పీకర్ ఫోన్ ఆన్ చేసేసి తమ పనులు తాము చేసుకుంటున్నట్లు ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి. అంటే చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ అంటేనే అంత భయపడుతున్నారు.

ఈ విషయాలన్నింటినీ పార్టీ నేతల ద్వారా విన్న తర్వాత చంద్రబాబు ఆలోచనలో కొంత మార్పు వచ్చినట్లు సమాచారం. ఇదే అదునుగా కొందరు నేతలు ఇటీవల సిఎంతో జరిగిన సమావేశాల్లో తమ మనసులో మాటను కూడా వెల్లడించినట్లు తెలిసింది. నిరంతరం ప్రభుత్వ కార్యక్రమాలు, టెలికాన్ఫరెన్సులలో వుంటున్న చంద్రబాబు పార్టీ నేతలకు, కార్యక్రమాలకు దూరం అయిపోతున్నట్లు చెప్పారట.

గతంలో అంటే 1999-2004 మధ్య పార్టీకి చంద్రబాబుకు మధ్య అంతరం పెరిగిపోయినట్లే ఇపుడు కూడా అంతరం పెరిగిపోతోందని నేతలు వాపోయారట. అంతే కాకుండా టెలికాన్ఫరెన్స్ సమయాన్ని తగ్గించుకుని అందులో కొంత సమయాన్ని నేతలకు, పార్టీ క్యాడర్ కు కేటాయించాల్సిందేనంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పినట్లు సమాచారం. దాంతో చంద్రబాబు కూడా ఈ విషయాన్ని ఆలోచించినట్లు తెలిసింది.

దాంతో కొంత కాలం పాటు టెలికాన్ఫరెన్స్ లకు విరామం ఇవ్వాలని ఎంతో అవసరం అయితే తప్ప టెలికాన్ఫరెన్సులకు హాజరవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాలు తెలిసిన నేతలు, ఉన్నతాధికారులు ఎంతో రిలీఫ్ ఫీల్ అవుతున్నారుట.