ఏపీ ప్రభుత్వ ప్రకటనలో తెలంగాణ లోగో.. !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వ లోగో కనబడడం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు పాలకపక్షంపై విమర్శలు చేయడానికి అస్త్రంలా మారింది ఈ యాడ్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వ లోగో కనబడడం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు పాలకపక్షంపై విమర్శలు చేయడానికి అస్త్రంలా మారింది ఈ యాడ్.
విషయం ఏంటంటే.. ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం చేయాలంటూ చేద్దామని జగన్ సర్కారు పిలుపునిచ్చింది. ఇందుకోసం ఓ ప్రకటన సైతం జారీ చేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సర్కారుకు ఎన్నికల కమిషన్ కు జరిగిన వార్ తెలిసిందే.
అయితే సుప్రీం కోర్టు తీర్పుతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో రాష్ట్రం ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహణకు సహకరిస్తామని తెలిపింది. కాగా పంచాయతీ ఎన్నికలకు పార్టీలతో సంబంధం లేదని.. ఏకగ్రీవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ సర్కారు చెబుతోంది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను పెంచడం కోసం ప్రోత్సాహకాలను గతంలో కంటే పెంచింది. 2 వేల లోపు జనాభా ఉన్న గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.5 లక్షలు, 2 వేల నుంచి 5 వేల జనాభా ఉన్న పంచాయతీ ఏకగ్రీవమైతే రూ.10 లక్షలు, పది వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 10 వేల పైబడిన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది.
ఈ మేరకు జీవో జారీ చేయడంతోపాటు పత్రికా ప్రకటన కూడా జారీ చేసింది. అయితే ఈ ప్రకటన ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, ఈ యాడ్ కోసం తెలంగాణ గ్రామ పంచాయతీ భవనం ఫోటో వాడడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
యాడ్ మేకర్లు తప్పులో కాలేశారు. సమాచార, పౌరసంబంధాల శాఖ ఇచ్చిన యాడ్‌లో పంచాయతీ ఆఫీసు భవనంపై తెలంగాణ సర్కారు చిహ్నం ఉండటంతో విపక్షాలు జగన్ సర్కారును టార్గెట్ చేశాయి. పంచాయతీ ఎన్నికల ప్రకటన కోసం ఏపీలో ఒక్క పంచాయతీ భవనమైనా మీకు దొరకలేదా..? అంటూ విరుచుకు పడుతున్నాయి.
దీనిమీద టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘అధికారిక వేలంపాటలో పాల్గొనాలి అని చెబుతున్నట్లు ఉంది వ్యవహారం చూస్తుంటే. మీ ప్రోత్సాహకాలు ఎప్పుడు వస్తాయి అన్నది ఎవరికి తెలీదు. కోట్లు గుమ్మరించి యాడ్స్ ఇస్తున్నారు ప్రభుత్వం వారు. అక్కడ ‘తెలంగాణ’ బొమ్మ కాకుండా ఆంధ్రప్రదేశ్ బొమ్మ ని పెట్టండి మహాప్రభో’ అంటూ ట్వీట్ చేశారు.