హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపనకు వైయస్ జగన్ ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నారు. 

ఈ తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంలో సీఎం వైయస్ జగన్ పేరును పొందుపరిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వాత రెండోపేరు వైయస్ జగన్ పేరును నమోదు చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్  జగన్ పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. తొలి ప్రారంభోత్సవానికే అరుదైన గౌరవం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. 

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన తనయుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా అమరావతిలోని వైయస్ జగన్ నివాసానికి వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా కోరారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవ శిలాఫలకంపై దేవేంద్ర ఫడ్నవీస్ పేరు కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 

అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. జగన్ ప్రారంభోత్సవానికి హాజరుకావడం దురదృష్టకరమంటూ విమర్శిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పేరు శిలాఫలకంపై పొందరుపరచడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.