తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ ఎత్తున అభిమానులున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన మరోసారి గెలిచి సీఎం అవ్వాలని వారు ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన కొణిజేటి ఆదినారాయణ అనే అభిమాని.. చంద్రశేఖర్ రావు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఘాట్‌రోడ్ సమీపంలో 101 కొబ్బరి కాయలు కొట్టారు.

అనంతరం కొణిజేటి మీడియాతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసీఆర్‌కు అభిమానులు ఉన్నారని... ఆంధ్రా నుంచి తెలంగాణకు వెళ్లి వ్యాపారం చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ రెండోసారి ప్రమాణం చేసిన వెంటనే తన మొక్కులు తీర్చుకుంటానని ఆదినారాయణ తెలిపారు.