బహిర్భూమికని ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి... సగం కాలిన శవంగా ఇంటికి చేరింది. దీని వెనుక ప్రేమ వ్యవహారమే కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన శ్రీకాళహస్తి పట్టణ శివారులోని డంపింగ్ యార్ట్ లో శుక్రవారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ కు చెందిన చంద్ర, భూరి దంపతులు జీవనోపాధి నిమిత్తం ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడ్డారు. పానీపూరి బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి కుమారుడు రింకు, కుమార్తె పంకీ(16) ఉన్నారు.  కాగా... వీరు పట్టణ శివారులోని చెన్నై రహదారి పక్కన పురపాలక సంఘం డంపింగ్ యార్డ్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

వీరి ఇంటికి మరుగుదొడ్డి లేకపోవడంతో బహిర్భూమికి డంపింగ్ యార్డ్ సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లేవారు. కాగా... ఇటీవల చంద్ర, భూరీ దంపతులు స్వస్థలానికి వెళ్లగా ఇంట్లో పింకీ, రింకు ఉన్నారు. గురువారం సాయంత్రం పంకీ బహిర్భూమికని బయటకు వెళ్లి... అర్థరాత్రి దాటినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన రింకు స్థానికులతో కలిసి వెళ్లి వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు.

కాగా... శుక్రవారం సాయంత్రం డంపింగ్ యార్డ్ కి కొద్ది దూరంలో పింకీ సగం కాలిన శవమై కనిపించింది. కాగా.. పంకీ శవం చూసి ఆమె సోదరుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. గతంలో పింకీ అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపిందని.. పెద్దలు హెచ్చరించడంతో అతనికి దూరంగా ఉంటోందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమె చావుకీ ఈ ప్రేమకు ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో ఆలోచిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.