పీఆర్సీ విషయంలో తమ అభిప్రాయాలను గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నుండి తప్పుకుంటున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాజీనామా లేఖ రాసారు.
అమరావతి: పీఆర్సీ (PRC) విషయంలో ఇటీవల ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ (PRC Sadhana Samithi Steering Committee) ఏకపక్షంగా వ్యవహరించిందని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ సంఘాల తరపున పీఆర్సీ సాధన సమితిలో కొనసాగుతున్న నాయకులు స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జేఏసీ ఛైర్మన్లకు రాజీనామాలు పంపుతున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు.
''పీఆర్సీపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధంగా ఉన్నాం. ఫ్యాప్టో ఆధ్వర్యంలో 5 రోజులు నిరసన కార్యక్రమాలు చేపడతాం. రౌండ్ టేబుల్ భేటీలో కార్యాచరణపై చర్చిస్తాం. మాతో కలిసి వచ్చే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో పెద్దఎత్తున ఉద్యమిస్తాం. ఉపాధ్యాయుల మనోభావాలు గౌరవించాలి'' అని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి.
ఉపాధ్యాయ సంఘాల రాజీనామా లేఖ యధావిధిగా...
పీఆర్సీ సాధన సమితి
స్టీరింగ్ కమిటీ సభ్యులకు,
కామ్రేడ్స్...
పీఆర్సీపై మంత్రుల కమిటీతో జరిగిన చర్చలలో ఏ అంశాలపై చర్చించాలి, వేటిపై పట్టుబట్టాలి అనేది ముందుగా స్టీరింగ్ కమిటీలో నిర్ణయించుకున్న ప్రకారం చర్యలు జరగలేదు. పీఆర్సీ రిపోర్టు ఇవ్వకుండా, జీఓలు అభేయన్స్ లో పెట్టకుండా చర్చలకు వెళ్లకూడదు అనే నియమాన్ని సడలించి మరీచర్యలకు వెళ్లాం. మాకు భిన్నాభిప్రాయం వున్నా మెజార్టీ సభ్యులు చర్చలకు వెళ్లాలన్న నిర్ణయాన్ని గైరవించి చర్చలకు హాజరయ్యాము.
అయితే పిట్ మెంట్, హెచ్ఆర్ఏ, గ్రాట్యుటీ, అడిషనల్ క్వాంటం పెన్షన్, సిపిఎస్ రద్దు లాంటి ముఖ్యమైన అంశాలపై తగినంతగా సాధన సమితి నాయకత్వం పట్టుబట్టలేదు. ముఖ్యంగా ఫిట్ మెంట్ కు సంబంధించి ఒక్కశాతం కూడా పెరుగుదల సాధించలేకపోయాం. ముఖ్యమంత్రి గారితో చెప్పుకునే అవకాశం కల్పించాలని అడిగినప్పుడు కనీసం మద్దతు పలకలేదు. సిపిఎస్, గ్రాట్యుటీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు ఇలా పలు ముఖ్యమైన అంశాలలో స్పష్టమైన నిర్ణయాలు రాబట్టలేకపోయాం. మంత్రుల కమిటీతో చర్చలు ముగిసిన వెంటనే జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో మాకు (ఎస్టీయూ, యూటిఎఫ్, ఎపిటిఎఫ్-1938) అంగీకారం లేదని మా అసంతృప్తిని స్పష్టంగా తెలిపాము. మా భిన్నాభిప్రాయాన్ని రికార్డు చేయమని కూడా కోరాము. మీరు అంగీకరించనందునే మేము బయటకు వచ్చాము.
ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సమావేశానికి హాజరైనట్లుగానే అటెండెన్స్ షీట్ లో మేము సంతకాలు చేసిన కాగితాన్ని చూపించి, మేము కూడా ఓప్పందాన్ని అంగీకరించినట్లు మీడియాకు చెప్పడం సరికాదు. ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు ఈ విధంగా వ్యవహరించడం తగదు. ఇది ప్రభుత్వ విశ్వసనీయతకే నష్టం. ప్రభుత్వం పీఆర్సీ పై తీసుకున్న నిర్ణయాలను ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఆమోదిస్తారని అనుకోవడం విజ్ఞత అనిపించుకోదు.
ఎంతో విశ్వాసంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సాధన సమితి ఇచ్చిన ''ఛలో విజయవాడ'' పిలుపుకు జయప్రదం చేశారు. పిఆర్సి సాధన సమితి నేతలు ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెడతామని చెప్పి ప్రభుత్వం దగ్గర అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. లక్షల మంది ఉపాధ్యాయులకు ప్రతినిధులుగా ఉన్నమేము తీవ్రంగా అభ్యంతరం చెప్పినా వాటికి విలువనివ్వలేదు. కనీసం ఫిబ్రవరి 6న ముఖ్యమంత్రి గారితో జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించలేదు.
కాబట్టి ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడలేకపోయిన ఈ పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి మేము రాజీనామా చేస్తున్నాము.
ఎస్టియూ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ జోసఫ్ సుధీర్ బాబు,
యుటియఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్,
ఎపిటిఎఫ్-1938 రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు.
