పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే గతి తప్పాడు. తప్పుడు పని చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఓ ఉపాధ్యాయుడు తన దగ్గర చదువుకునే  ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... దేవరపల్లి మండలం త్యాజంపూడికి చెందిన కొయ్య లక్ష్మయ్య 2012 నుంచి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కాగా.. అతని కన్ను తమ స్కూల్లో చదివే ఓ బాలికపై పడింది. పథకం ప్రకారం ప్లాన్ వేసి  నాలుగు నెలల క్రితం పాఠశాలలో బాలికపై లక్ష్మయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బాలికను బెదిరించాడు.  కాగా.. రెండు రోజుల కిందట ఈ విషయం బాలిక ఇంట్లో తెలిసింది. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు.. సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో... సదరు ఉపాధ్యాయుడి వర్గీయులు వచ్చి అతనిని రక్షించే ప్రయత్నం చేశారు.

బాలిక బంధువుల నుంచి రక్షించే వేరే గదిలో అతనిని దాచిపెట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని ఇరు వర్గీయులను శాంతింపచేశారు.

కాగా.. బాలిక ఫిర్యాదుతో ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. అదే ఉపాధ్యాయుడు తనని కూడా వేధిస్తున్నాండూ మరో బాలిక కూడా ఫిర్యాదు చేయడంతో... ఆ కేసు కూడా నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.