ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి మధ్య గొడవలు నిత్యకృత్యంగా మారాయి. చివరకు మహనీయుడు బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున కూడా ఇరుపార్టీలు గొడవపడ్డాయి,
గుంటూరు : అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకులు ప్రతి విషయానికి గొడవపడుతూ ఆంధ్ర ప్రదేశ్ అలజడికి కారణమవుతున్నారు. ప్రజా సేవ చేయడానికికంటూ రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు అదే ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ఇలా రాజకీయాలంటే తిట్టుకోవడం, కొట్టుకోవడమే అన్నట్లుగా మారింది ఏపీలో పరిస్థితి. చివరకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున కూడా రాజకీయాలు చేస్తూ గొడవకు దిగిన వైసిపి, టిడిపి నాయకులు అలజడి సృష్టించారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు లాడ్జి సెంటర్ లోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ నివాళులు అర్పించడానికి వెళ్లారు. అయితే మంత్రి మేరుగ నాగార్జున, జిల్లా కలెక్టర్ కూడా అంబేద్కర్ కు నివాళి అర్పించేందుకు అక్కడికి రానున్న నేపథ్యంలో ముందుగానే భారీగా వైసిపి నాయకులు అక్కడికి చేరుకున్నారు. వీరు టిడిపి నేతలతో కలిసి నివాళి అర్పించేందుకు వచ్చిన కన్నాను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
మంత్రి, కలెక్టర్ నివాళి అర్పించిన తర్వాతే మిగతావారు నివాళి అర్పించాలంటూ వైసిపి నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లనివ్వకుండా కన్నాను అడ్డుకున్నారు. ఈ క్రమంలో టిడిపి, వైసిపి నాయకుల మధ్య మాటామాటా పెరిగి తోపులాట జరిగింది. చివరకు ఎలాగోలా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న కన్నా నివాళి అర్పించి పూలమాల వేసారు. అయితే ఆయన వెళ్లిపోగానే వైసిపి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి కన్నా వేసిన పూలమాలను తొలగించారు.
Video గుడివాడ శరత్ థియేటర్ వద్ద ఉద్రిక్తత... తన్నుకున్న వైసిపి, టిడిపి శ్రేణులు
ఈ ఘటనపై గుంటూరు మేయర్ కావటి మనోహర్ స్సందించారు. అధికారికంగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించకుండానే కన్నా నేతృత్వంలో టిడిపి నాయకులు రౌడీయిజం చేయడానికి వచ్చారని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత నివాళి అర్పించాలని వైసిపి నాయకులు కోరగా వారిపై దాడి చేసారని ఆరోపించారు. అంబేద్కర్ సాక్షిగా ఓ దళితుడిని తోసేసి కన్నా లక్ష్మీ నారాయణ ఆద్వర్యంలో దాడి చేయబోయారని అన్నారు.
మంత్రులు, అధికారులు ప్రారంబించకుండానే టిడిపి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయడంలో ఆంతర్యం ఏంటి? గొడవ పెట్టుకోవాలనే కన్నా టిడిపి నాయకులను వేసుకుని వచ్చారని ఆరోపించారు. దళితులను అవమానించే వ్యవహరించిన కన్నా వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి … లేదంటే తీవ్ర చర్యలు ఉంటాయని గుంటూరు మేయర్ హెచ్చరించారు.
ఇక అంబేద్కర్ జయంతి రోజున కనీసం నివాళి కూడా అర్పించే అవకాశం కూడా ఇవ్వకపోవడం దారుణమంటూ టీడీపీ ఎస్సీ సెల్ నేతలు మండిపడుతున్నారు. కన్నా పట్ల దళిత సంఘాలు, వైసిపి నేతల వ్యవహరించిన తీరుపై టిడిపి నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
