అధికార పార్టీకి ప్రజాస్వామ్యమన్నా, చట్టం, న్యాయమన్నా అసలు లెక్కే లేనట్లుంది.
అధికార మత్తు టిడిపికి బాగానే తలకెక్కినట్లుంది. అందుకనే చట్టం, న్యాయం తమకు వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా రోజా గన్నవరం కోర్టుకు హాజరైనపుడు టిడిపి నేతలు, కార్యకర్తలు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. డిజిపి సాంబశివరావుపై వైసీపీ ఎంఎల్ఏ రోజా ఓ కేసు వేసారు. మహిళా సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన రోజాను పోలీసులు కారణాలు చెప్పకుండా అరెస్టు చేసారు. గన్నవరం విమానాశ్రయంలోనే అరెస్టు చేసిన రోజాను ఏకంగా హైదరాబాద్ లో వదిలిపెట్టారు. దాంతో మండిపడిన రోజా తనను అరెస్టు చేయటంపై డిజిపిపై గన్నవరం కోర్టులోనే కేసువేసారు. ఆ కేసు విచారణ నిమ్మితమే రోజా ఈరోజు కోర్టుకు వచ్చారు.
అయితే, రోజా కోర్టుకు వస్తున్న విషయం తెలియగానే టిడిపి శ్రేణులు పార్టీ జెండాలను పట్టుకుని కోర్టు వద్ద పెద్ద గొడవే చేసారు. ఎంఎల్ఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోర్టులోకి దూసుకుపోయే ప్రయత్నాలు కూడా చేసారు. దాంతో వారిని ఆపటానికి పోలీసులు నానా అవస్తులు పడ్డారు. చివరకు అందరినీ అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించిన తర్వాత తప్పని సరిగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. చూస్తుంటే, అధికార పార్టీకి ప్రజాస్వామ్యమన్నా, చట్టం, న్యాయమన్నా అసలు లెక్కే లేనట్లుంది.
