విశాఖపట్నం: జగన్ పాలనలో ఎవ్వరికీ రక్షణ లేదనుకున్నామని...కానీ దేవుళ్ళకి రక్షణ లేకపోవడం మరీ దారుణమని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షాత్తు రామపాదం కలిగిన రామతీర్థం పవిత్ర క్షేత్రంలో శ్రీరాముని విగ్రహం శిరస్సును తొలగించడం దారుణమన్నారు. ధ్వంసమైన విగ్రహానికి శిరస్సు అతికించడంపై ప్రభుత్వం చర్చిస్తుంది కానీ నిందితుల గురుంచి జగన్ ఆలోచన చేయకపోవడం దురదృష్టమని అనిత మండిపడ్డారు.

''ప్రతి దుశ్చర్య వెనుక పిచ్చోడు ఉన్నారంటారు. నిజంగానే పిచ్చోడి పాలనలో పిచ్చోళ్ళ పెరిగారు. అన్ని మతాలను రాష్ట్ర సీఎం గౌరవించాలి. కానీ హిందూ మనోభావాలు దెబ్బతింటున్నా జగన్ కు చీమకుట్టినట్టు లేదు'' అని ఆరోపించారు.

''తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ దర్శనం చేసుకున్న దగ్గర్నుంచి దాడులు ఎక్కువయ్యాయి. ఈ దాడులపై రాజకీయాలకు అతీతంగా అందరూ పోరాడాలి. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం తధ్యం. అప్పుడు ఈ దాడులు వెనుక ఉన్నవారిని శిక్షిస్తాం'' అని అన్నారు.

''ఇక పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావు అవినీతి చేయలేదని ఉపమాక వెంకన్నపై ప్రమాణం చేయండి'' అంటూ టిడిపి మహిళా అధ్యక్షురాలు అనిత సవాల్ విసిరారు.