‘మాకు పోతే వెంట్రుకే..టిడిపికి మాత్రం బోడిగుండే’..ఇది మంత్రి మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు. టిడిపి-బిజెపి పొత్తు పై బిజెపి మంత్రి చేసిన కామెంట్ ఇపుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అందులో నిజానిజాలు ఎంత అన్న విషయంపై రాజకీయనేతలు విశ్లేషణలు మొదలుపెట్టారు.

మాణిక్యాలరావు కామెంట్లలో ఎంత నిజముందో చూద్దాం. పోయిన ఎన్నికల్లో టిడిపి-బిజెపిలు పొత్తు పెట్టుకున్నాయి. అప్పట్లో ఒక పార్టీ వల్ల మరోపార్టీ లాభపడిందన్నది వాస్తవం. దేశవ్యాప్తంగా నరేంద్రమోడి పై ఉన్న క్రేజ్ టిడిపికే ఎక్కువ ఉపయోగపడింది. టిడిపి క్యాడర్ కూడా బిజెపికి ఎంతో కొంత ఉపయోగపడ్డారు.

అదే సందర్భంలో పవన్ కల్యాణ్ మద్దతు కూడా టిడిపి, బిజెపిలకు బాగా కలసివచ్చిందనటంలో సందేహం లేదు. సరే నరేంద్రమోడి, చంద్రబాబు, పవన్ కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నా వైసిపికన్నా అదనంగా తెచ్చుకున్న ఓట్లు కేవలం 5 లక్షలు మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చంద్రబాబైనా, పవన్ అయినా జగన్ కు చేయాల్సిన డ్యామేజి అంతా అప్పట్లోనే చేసేసారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్ కు కొత్తగా జరగబోయే డ్యామేజీ ఏమీలేదు.

సరే, మంత్రి కామెంట్ల విషయాన్ని చూస్తే, నిజానికి బిజెపికున్న బలం నామమాత్రమే. ఒంటిరిగా పోటీ చేయాలని అనుకుంటున్న బిజెపి నేతలు 175 నియోజకవర్గాల్లోనూ గట్టి అభ్యర్ధులను నిలబెట్టగలిగితే చాలు.

ఇక, టిడిపి సంగతి అంటారా మూడున్నరేళ్ళ పాలనలో చంద్రబాబునాయుడుపై ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. విభజన చట్టంలోని హామీలను కేంద్ర అమలు చేయకపోవటంలో చంద్రబాబు చేతకానితనం కూడా ఉంది. ఇక, పెరిగిపోయిన అవినీతి, విచ్చలవిడితనం, టిడిపి నేతల బరితెగింపు, జన్మభూమి కమిటీల మాఫియా లాంటివి ఎన్ని చెప్పుకున్నా తక్కువే.

పోయిన ఎన్నికల్లో బిజెపి గెలిచింది 4 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్ధానాలు మాత్రమే. వచ్చే ఎన్నికల్లో వాటిని నిలుపుకోలేకపోయినా బిజెపికి వచ్చే నష్టం ఏమీలేదు. టిడిపి పరిస్దితి అలాకాదు. వచ్చే ఎన్నికల్లో అధికారం కోల్పోతే చంద్రబాబుతో పాటు చాలామంది టిడిపి నేతలు ఇబ్బందుల్లో పడతారు.

బిజెపి రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా కేంద్రంలో ఉంటే చాలు నెట్టుకొచ్చేస్తుంది. సమస్యంతా చంద్రబాబుకే. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే బిజెపితో విడిపోతే టిడిపికి బోడిగుండే అన్నది. వ్యవహారం చూడబోతే మాణిక్యాలరావు చెప్పిందే నిజమవుతుందేమో?