తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో భారీ విజయం సాధించి అదికారాన్ని చేపట్టనుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేసారు. బోస్టన్ లో జరుగుతున్న ఎన్నారై టిడిపి మహానాడులో ఆయన వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. 

అమరవతి: ఎపిలో జగన్ పాలనతో రాష్ట్రంలో ఎన్నడూ జరగనంత నష్టం జరిగిందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు (nara chandrababu naidu) అన్నారు. 2024లో మళ్లీ టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర పునర్నిర్మాణం జరపాల్సి ఉందన్నారు. మళ్ళీ తెలుగు దేశం అధికారంలోకి రావాలని ప్రజలు ఏకపక్షంగా కోరుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. 

బోస్టన్ లో జరుగుతున్న ఎన్నారై టిడిపి మహానాడులో చంద్రబాబు ఆన్లైన్ విధానంలో పాల్గొని ప్రసగించారు. 2200 మందితో బోస్టన్ లో మహానాడు నిర్వహణ గర్వకారణం అని ఆయన అభినందించారు. ఇలాగే టిడిపి బలోపేతానికి ఎన్నారైలు తమవంతు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. 

తెలుగు దేశం ఆవిర్భావం తరువాతనే తెలుగు ప్రజల జీవితాల్లో పెను మార్పులు వచ్చాయని చంద్రబాబు అన్నారు. ఈ రోజు లక్షల మంది ఉన్నత చదువులతో ఐటి రంగంలో స్థిరపడడానికి నాడు తెలుగు దేశం ప్రభుత్వ తీసుకున్న పాలసీలే కారణం అని చంద్రబాబు అన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో పరిస్థితులు, ప్రజల వెతలు, వ్యవస్థల విధ్వంసంపై ఎన్ఆర్ఐలతో చంద్రబాబు మాట్లాడారు. జగన్ పాలనతో రాష్ట్రం కోలుకోలేనంతగా నష్టపోయిందని చంద్రబాబు అన్నారు. పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులను జగన్ ఎలా ధ్వంసం చేశారో ప్రజలు చూశారని అన్నారు. 

తెలంగాణలో కొన్ని కులాలను బిసిల జాబితా నుంచి తొలగిస్తే నోరెత్తని ఆర్ కృష్ణయ్య లాంటి వారికి, తనతో పాటు కేసుల్లో ఉన్నవారికి జగన్ రాజ్యసభ ఇచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. తాను ప్రకటించినట్లు వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తానని చంద్రబాబు అన్నారు. 2024లో టిడిపిని అధికారంలోకి తీసుకురావడంలో ఎన్ఆర్ఐ లు తమ వంతు పాత్ర పోషించాలని చంద్రబాబు కోరారు.

ఇదిలావుంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల 2024కు ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలతో ముందస్తు ప్రచారం మరింత జోరందుకుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిడిపి లీడర్లు, క్యాడర్ సిద్దంగా వుండాలని చంద్రబాబు సూచించడం ఏపీలో ముందుస్తు ఖాయమేనని అర్థమవుతోంది.

ఈ క్రమంలోనే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చంద్రబాబు సిద్దంచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాదుడే బాదుడు పేరిట నిత్యావసరాలు, ప్రభుత్వ పన్నుల పెంపుపై నిరసనలు చేపడుతూ టిడిపిని ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ఇప్పుడు యువతకు పార్టీలో ప్రాధాన్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా వుండేలా పార్టీ లీడర్లను, క్యాడర్ ను చంద్రబాబు సిద్దం చేస్తున్నారు. 

ప్రస్తుతం వైసిపి గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల్లోకి వెళితే టిడిపి బాదుడే బాదుడు పేరిట వెళుతోంది. ఈ రెండింటినీ గమనిస్తే ప్రజల మద్దతు ఎవరికి వుందో స్పష్టంగా తెలిసిపోతోందని చంద్రబాబు అన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు టిడిపి ఇప్పుడు ఒక హోప్ గా కనిపిస్తోందని... కాబట్టే ప్రజల్లోకి వెళ్లిన టిడిపికి స్వాగతాలు...గడపగడపలో వైసిపి నేతలకు నిలదీతలు అందుకు నిదర్శనమన్నారు చంద్రబాబు.