చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే కేంద్ర మంత్రివర్గంలో నుండి బయటకు వచ్చేసిన టిడిపి తాజాగా ఎన్డీఏలో నుండి కూడా వచ్చేయాలని నిర్ణయించింది. శుక్రవారం ఉదయం ఎంపిలు, పొలిట్ బ్యూరో సభ్యులు, మంత్రులు, కీలక నేతలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించిన చంద్రబాబు ఎన్డీఏలో నుండి కూడా బయటకు వచ్చేయాలని డిసైడ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంపై టిడిపినే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూడా ఎంపిలను ఆదేశించారు.

అయితే, ఇంత హటాత్తుగా సొంతంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఉన్న అవకాశాలను ఎంపిలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వైసిపి ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు ఉదయం నుండే చంద్రబాబు తన నివాసం నుండి జాతీయపార్టీలైన ఎన్సీపీ, టిఎంసి, బీజెడి, అన్నాడిఎంకె, శివసేనతో పాటు ఇతర పార్టీలతో అధినేతలతో మంతనాలు జరుపుతున్నారు. నిజానికి ఈరోజు సాయంత్రం పొలిట్ బ్యూరో సమావేశం జరగాల్సుంది. కానీ ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపద్యంలో చంద్రబాబు ఉదయమే టెలికాన్ఫరెన్సులో కీలక నేతలతో మాట్లాడేసి నిర్ణయం తీసుకున్నారు. మరి సాయంత్రం జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో ఏం మాట్లాడుతారో చూడాలి.