విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలుగుదేశం పార్టీ బృందం వేచి చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైయస్ జగన్ కు స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ ఒక బృందాన్ని నియమించింది. 

మాజీమంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లతో కూడిన బృందం జగన్ అపాయింట్మెంట్ కోరింది. అయితే వైయస్ జగన్ అపాయింట్మెంట్ ఇప్పటికీ ఖరారు కాలేదు. వైయస్ జగన్ బిజీబిజీగా ఉండటంతో ఆయన అపాయింట్మెంట్ ఖరారు కాలేదని తెలుస్తోంది. 

మరోవైపు తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా వైయస్ జగన్ మాజీసీఎం చంద్రబాబు నాయుడును స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. జగన్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అంశంపై టీడీఎల్పీ భేటీలో చంద్రబాబు ప్రస్తావించారు. 

జగన్ ఆహ్వానం ప్రకారం వెళ్తే బాగుంటుందని చంద్రబాబు అనగా మిగిలిన ఎమ్మెల్యేలు అంగీకరించలేదు. దీంతో జగన్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరుకాకుండా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలతో కూడిన లేఖ ఇవ్వాలని నిర్ణయించుకుంది. 

తెలుగుదేశం పార్టీ తరపున అభినందన లేఖ అందజేసేందుకు ఉదయం నుంచి టీడీపీ బృందం వేచిచూస్తోంది. అయితే వైయస్ జగన్ 11.20గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు బయలుదేరుతారు. ఆ సమయంలోనైనా కలిసి టీడీపీ తరపున అభినందన లేఖ అందజేయాలని బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.