గంజాయి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మహిళా నేత మానుకొండ జాహ్నవిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది తెలుగుదేశం. ఈ మేరకు టీడీపీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ బచ్చుల అర్జునుడు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.  

టీడీపీ మహిళా నేత మానుకొండ జాహ్నవిని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఆదేశాల మేరకు టీడీపీ నుండి సస్పెండ్ చేశారు. జాహ్నవి 2013లో నమోదైన గంజాయి కేసులో ఆదివారం అరెస్టు అయ్యారు. ఈ కేసులో తుదితీర్పు వచ్చి, నిజనిజాలు తేలే వరకు ఆమెపై సస్పెన్షన్ కొనసాగుతుంది. ఈ మేరకు టీడీపీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ బచ్చుల అర్జునుడు ఆదేశాలు జారీ చేశారు. 

కాగా.. గంజాయి తరలింపు కేసులో TDP కి చెందిన మహిళా నేత Jahanaviని సైబరాబాద్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. 2013లో సైబరాబాద్‌లో నమోదైన కేసులో జాహ్నవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. తాజాగా ఉమ్మడి Guntur జిల్లా Narasaraopet కు చెందిన జాహ్నవిని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. NDPC యాక్ట్ కింది నలుగురిపై 2013లో పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగుదారులు, సరఫరాదారులపై నిఘాను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున గంజాయిని సరఫరా చేస్తున్నారనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇటీవల కాలంలో ఈ విషయమై కేసులు కూడా నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు కూడా విశాఖ ఏజన్సీ నుండి గంజాయి,. హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. గత మాసంలో తెలంగాణలో హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి విశాఖ జిల్లా నుండే గంజాయితో పాటు హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.