మారిన బలాలు: ఏపీ శాసనమండలిలో వైసీపీకి పెరిగిన బలం, తగ్గిన టీడీపీ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో టీడీపీ సంఖ్య బలం తగ్గిపోయింది. ఇవాళ మొత్తం ఎనిమిది మంది సభ్యులు రిటైరౌతున్నారు. ఇందులో ఏడుగురు సభ్యులు టీడీపీకి చెందినవారు. ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి కూడ ఇవాళ రిటైర్ కానున్నారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో టీడీపీ సంఖ్య బలం తగ్గిపోయింది. ఇవాళ మొత్తం ఎనిమిది మంది సభ్యులు రిటైరౌతున్నారు. ఇందులో ఏడుగురు సభ్యులు టీడీపీకి చెందినవారు. ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి కూడ ఇవాళ రిటైర్ కానున్నారు.
ఏపీ శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులుంటారు. ఇవాళ టీడీపీకి చెందిన రెడ్డి సుబ్రమణ్యం,వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పల చలపతి రావు, గాలి సరస్వతి, ద్వారపు రెడ్డి జగదీశ్వరరావు, బుద్దా నాగ జగదీశ్వరరావుల రిటైర్ కానున్నారు. వైసీపీ నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు రిటైర్ అవుతున్నారు. దీంతో టీడీపీ సభ్యుల సంఖ్య 15కి తగ్గిపోనుంది. వైసీపీ బలం 21కి పెరిగింది.ఏపీ శాసనమండలిలో టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో సాంకేతికంగా ఆయన టీడీపీ సభ్యుడుగా లెక్కించలేం.
రెండు రోజుల క్రితం గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలుగా నామినేటయ్యారు.ఈ నలుగురి బలంతో వైసీపీ బలం 21కి చేరుకొంది. స్థానిక సంస్థల ద్వారా శాసనమండలిలో 11 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఈ స్థానాలను భర్తీ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. శాసనమండిలో పీడీఎఫ్ సభ్యులు నలుగురున్నారు. యూటీఎఫ్ సభ్యుడు ఒకరున్నారు. ఇండిపెండెంట్లు ముగ్గురున్నారు.
శాసనమండలిలో టీడీపీకి ఇప్పటివరకు బలం ఉండడంతో శాసనభలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన బిల్లులను మండలిలో అడ్డుకొంది టీడీపీ. అయితే ఎగువ సభలో టీడీపీ బలం తగ్గి వైసీపీ బలం పెరగడంతో ఇక వైసీపీ సర్కార్ కు ఇబ్బందులు లేకుండాపోయింది. గతంలో మూడు రాజధానుల బిల్లులతో పాటు ఇతర బిల్లులను శాసనమండలిలో టీడీపీ అడ్డుకొన్న విషయం తెలిసిందే.