కడప: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన జిల్లాలో ఎదురుగాలి వీస్తోందా... జగన్ కోట బీటలు వారుతుందా...జగన్ నిర్లక్ష్యమే వైఎస్ కంచుకోటను దెబ్బతీస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు టీడీపీ చాకచక్యంగా పావులు కదుపుతుంది. 

2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తుంటే ఆయన సొంత జిల్లా కడపలో మాత్రం ఆయనకు ప్రతికూల పరిస్థితులు ఎదురువుతున్నాయి. 

ఇప్పటికే పలు సర్వేలు ఏపీ జగన్ కు అనుకూలంగా ఉందంటూ వార్తలు వస్తున్నా కడపలో మాత్రం నెగెటివ్ రిజల్ట్స్ వస్తుంది. ఇది వైఎస్ కుటుంబీకులకు మింగుడు పడటం లేదు. ఇన్నాళ్ళు వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటలా ఉన్న కడప కోటకు బీటలు వారుతున్నాయి. కంచుకోటలాంటి కడప జిల్లాను వైఎస్ జగన్ నిర్లక్ష్యం చేయడమే అందుకు కారణమని తెలుస్తోంది. 

2019లో అధికారంలోకి వచ్చేందుకు జగన్ రాష్ట్రంపై దృష్టి సారిస్తే చంద్రబాబు మాత్రం కడప జిల్లాపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ జెండా ఎగరేసి పులివెందుల పులిబిడ్డ జగన్ కాదు అని నిరూపించాలని చంద్రబాబు తాపత్రాయపడుతున్నారు. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నారు. 

ఇప్పటికే వైఎస్ కుటుంబంపై నాలుగు సార్లు పోటీ చేసి ఓటమి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఈసారి ఎలాగైనా గెలవాలని కసితో రగిలిపోతున్నారు. 2019లో పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురవెయ్యాలని ఉవ్విళ్లూరుతున్న సతీష్ రెడ్డి అందుకు తగ్గట్టుగానే నియోజకవర్గంపై పట్టు సాధిస్తున్నారు. 

అందుకు కలిసి వచ్చే ప్రతీ అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అటు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దగ్గర బంధువు కావడంతో ఆయన రాజకీయ అనుభవాన్ని కూడా వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే వైఎస్ వ్యతిరేకులతో సమావేశమైన సతీష్ రెడ్డి వారందరిని తనవైపుకు తిప్పుకున్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో పులివెందులలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని కూడా సవాల్ విసిరారు సతీష్ రెడ్డి. దాదాపుగా 1999 నుంచి వైఎస్ కుటుంబంపై సతీష్ రెడ్డి పోటీ చేస్తూనే ఉన్నారు. ఓడిపోతూనే ఉన్నారు. కానీ ఈసారి మాత్రం గెలుస్తానని మాంచి ధీమా మీద ఉన్నారు. 

ఇకపోతే పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానిదే హవా. 1978 నుంచి వైఎస్ కుటుంబమే ఆ నియోజకవర్గంలో పాగా వేస్తూ వచ్చింది. అందుకే వైఎస్ఆర్ ను పులివెందుల పులి అని, ఆ తర్వాత వైఎస్ జగన్ ను పులివెందుల పులిబిడ్డ అని అంటూ ఉంటారు. అంటే ఆ నియోజకవర్గాన్ని తమ ఇంటిపేరుగా మార్చేసుకున్నంత సంబంధం ఉంది.

నాలుగు దశాబ్ధాలుగా వైఎస్ కట్టుకున్న పులివెందుల కోటకు ప్రస్తుతం బీటలు వారే ప్రమాదం ఉంది. వైఎస్ కట్టుకున్న కంచు కోటను కూల్చేందుకు టీడీపీ పావులు కదుపుతుంది. వాస్తవానికి పులివెందుల కోటను ఢీకొట్టడం టీడీపీకి అంత ఈజీ కాదు. అయితే ఈసారి తమకు అనుకూల పవనాలు వీస్తున్నాయని సతీష్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. 

అలాగే మూడు నెలల వ్యవధిలో కడప జిల్లాలో టీడీపీ నేతలు తిష్టవేసినట్లు వేశారు. ఉక్కు కర్మాగారం కోసం ఆమరణ నిరాహార దీక్షలు, ధర్మపోరాట దీక్ష, వనం మనం వంటి బహిరంగ సభలతో కడప జిల్లాలో పాగావేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో టీడీపీ పోరాటం ప్రతి ఒక్కరికి గుర్తుండి పోయేలా ప్రచారం కూడా చేసుకున్నారు. 

ఇకపోతే కడప కోటలో టీడీపీ పాగా వెయ్యడం కష్టమని తెలిసినప్పటికీ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందుల నియోజకవర్గంపై దృష్టిసారించారు టీడీపీ నేతలు. గతకొంతకాలంగా చూస్తుంటే టీడీపీ ఓటు బ్యాంకు పెరుగుతూ వచ్చిందని అలాగే సతీష్ పై సానుభూతి కూడా వర్క్ అవుట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. 

అయితే పులివెందుల నియోజకవర్గంలో గతం, ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. సతీష్ రెడ్డి 1999 నుంచి పులివెందులలో వైఎస్ కుటుంబంతో తలపడుతున్నారు. 199ఎన్నికల్లో సతీష్ రెడ్డి  వైఎస్‌తో పోటీపడ్డారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ 30 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. ఆ ఎన్నికల్లో వైఎస్ ఆర్ కు 62 వేల ఓట్లు రాగా, సతీష్‌ రెడ్డికి 32వేలు ఓట్లు వచ్చాయి. 
 
మళ్ళీ 2004 లో వైఎస్ తోనే తలపడ్డారు సతీష్ రెడ్డి. ఆ ఎన్నికల్లో కూడా వైఎస్ 40 వేలకు పైగా ఓట్ల మెజారిటీ‌తో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో వైఎస్‌కు 74,432 ఓట్లు రాగా సతీష్ రెడ్డి‌కి 33,655 ఓట్లు పోలయ్యాయి. 

ఆతర్వాత 2009 ఎన్నికల్లోనూ దివంగత సీఎం వైఎస్ తోనే తలపడ్డారు సతీష్ రెడ్డి. ఆ ఎన్నికల్లో వైఎస్ ఆర్ 68,681 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో వైఎస్‌1,03,556 ఓట్లు సాధించగా సతీష్ రెడ్డి 34,875 మాత్రమే సాధించగలిగారు. వైఎస్ మరణానంతరం 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు సతీష్ రెడ్డి.

 ఆ ఎన్నికల్లో జగన్ 95వేల 243 ఓట్ల మెజారిటీ సాధించారు. పులివెందుల నియోజకవర్గంలో ఈ మెజారిటీ ఇప్పటికీ ఓ రికార్డుగా నమోదైంది. 2014 ఎన్నికల్లో జగన్ కి 1,44,576 రాగా సతీష్ రెడ్డికి 49,333 ఓట్లు  వచ్చాయి. 

ఇకపోతే ప్రతీ ఎన్నికల్లో సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబం చేతిలో పరాజయం పాలవుతున్నా ఓట్ల శాతాన్ని మాత్రం పెంచుకోగలుగుతున్నారు. ప్రతీ ఎన్నికల్లో కనీసం 5 నుంచి 15 వేల ఓట్లను పెంచుకోగలుగుతున్నారు. 

అలాగే వైఎస్ కుటుంబం చేతిలో నాలుగు సార్లు ఓటమి పాలవ్వడం అది తనకు కలిసొచ్చే అంశంగా సతీష్ రెడ్డి భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటం తనకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇకపోతే ప్రతీ ఎన్నికల్లో సతీష్ రెడ్డి తాను ఓట్లను పెంచుకుంటున్నా అదే స్థాయిలో వైఎస్ కుటుంబం కూడా ఓట్ల శాతాన్ని విపరీతంగా పెంచుకుంటూ పోతుంది. 

ఈ నేపథ్యంలో సతీష్ రెడ్డి గెలుపు సాధ్యామా అన్న సందేహం నెలకొంది. 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ కు వచ్చిన మెజారిటీ 95వేల 243 ఓట్లు. అంత మెజారిటీని తగ్గించడమంటే ఓ అద్భుతం జరిగితే కానీ సాధ్యం కాదు. మెుత్తం జిల్లాలో టీడీపీ గాలి వీస్తే కానీ అది సాధ్యం కాదు అని చెప్పుకోవాలి. 

2014 ఎన్నికల్లో ఒక్క రాజంపేట మినహా మిగిలిన తొమ్మిది స్థానాలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కానీ ప్రస్తుతం సీన్ మారిందని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో అనేక సమస్యలున్నాయని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు వాటిని పరిష్కరించడం లేదని ప్రజలు వాపోతున్నారు.  

జగన్ పాదయాత్రల పేరుతో నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రజల కనీస అవసరాలను తీర్చలేని జగన్‌ రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని టీడీపీ విమర్శిస్తుంది. 

పులివెందులకు కృష్ణా జలాలను తెప్పించడంలో సఫలీకృతులైన చంద్రబాబు కడప ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని ఫలితంగా ఈసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయం అంటున్నారు టీడీపీ నేతలు.

ఇదిలా ఉంటే టీడీపీ చేస్తున్న కార్యక్రమాలకు వైసీపీ నుంచి ఎలాంటి ధీటైన ప్రోగ్రామ్స్ నిర్వహించడం లేదు. జగన్ పాదయాత్ర చేస్తుంటే కడప జిల్లాలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోవడం లేదు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలలు లోటస్ పాండ్ కే పరిమితమయ్యారు. దీంతో వైసీపీ కంటే టీడీపీ చేపట్టిన కార్యక్రమాలే జిల్లాలో వినబడుతున్నాయి.

అటు టీడీపీలో ఉన్న విబేధాలను సైతం వైసీపీ క్యాష్ చేసుకోలేకపోతుందనే ప్రచారం కూడా ఉంది. వీరశివారెడ్డి, సీఎం రమేష్ ల మధ్య నెలకొన్న వివాదాన్ని కానీ, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నెలకొన్న వివాదాలను కానీ పట్టించుకోవడం లేదని దీంతో వైసీపీ నేతలు నిరుత్సాహంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

కడప జిల్లాలో ఇప్పటికే టీడీపీ తన ఓటు బ్యాంకును పెంచుకుంటూ పోతుందని అయితే వైఎస్ జగన్ ను ఢీకొట్టే అంత ఉందా అన్నది సందేహంగా మారింది. అయితే ఏదో మిరాకిల్ జరిగితే  కానీ వైఎస్ కంచుకోటను కానీ కడప జిల్లాను కానీ ఢీకొట్టే అవకాశం లేదు. అయితే టీడీపీ మాత్రం కడపలో పాగా వేస్తామని చెప్తోంది. అయితే ఎలా పాగావేస్తుందోనన్నది మాత్రం గండికోట రహస్యంగా చెప్తోంది.