TDP Achennaidu: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీ వల్ల.. రాష్ట్రంలో పేదవారు విపరీతంగా చనిపోతున్నారనీ, అయినా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు.
TDP Achennaidu: వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మద్యం పాలసీ వల్ల రాష్ట్రంలో పేదవారు విపరీతంగా చనిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నివాళి అర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశమై.. వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు.
టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు టీడీపీ ప్రజా ప్రతినిధులు జంగారెడ్డిగూడెంకు వెళ్లి మృతుల కుటుంబాలను ఓదార్చి వచ్చామని తెలిపారు. జంగారెడ్డిగూడెం మరణాలపై దృష్టి సారించి విచారణ చేపడితే జగన్ బ్రాండ్స్ మద్యం సేవించి జనం పిట్టల్లా రాలిపోతున్నట్లు తేలిందని, ఏలూరు జనరల్ ఆస్పత్రిలో 15 రోజుల్లో జగన్ జే బ్రాండ్స్ తాగి అనేకమంది చనిపోయినట్లు సాక్ష్యాధారాలున్నాయని ఆరోపించారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే.. తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదనీ, జే బ్రాండ్స్ పై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసి ఎక్కడ తప్పు జరుగుతోందో తప్పక తేలుస్తామని విమర్శించారు. జగన్ తెచ్చిన జే బ్రాండ్స్ మద్యం తాగి అనేకమంది చనిపోతుంటే ... ప్రభుత్వం దాన్ని బయటికి రాకుండా దాచుతోందని ఆరోపించారు. పేదవాడు జగన్ బ్రాండ్లను కొనలేక కల్తీ సారాతాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడని, డాక్టర్లను భయపెట్టి తప్పుడు రిపోర్టులు తెప్పించుకున్నా నిజం నిత్యం దాగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జే బ్రాండ్స్ తాగి చనిపోతుంటే అది బయటికి రాకుండా ప్రభుత్వం దాస్తోందని విమర్శించారు.
ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలకన్నా ధనదాహం అధికంగా ఉందని , ప్రభుత్వం మద్యం పాలసీ మీద చిత్తశుద్ధితో వ్యవహరించాలని, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మద్యంపై ప్రజల్లో దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే దశలవారీగా మద్యపాన నిషేదం విధిస్తానని చెప్పి ఏకంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని, మద్యపాన నిషేదాన్ని విధించేవరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వైసీపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్‌సీపీ నేతల ప్రోత్సాహంతోనే కల్తీ మద్యం తయారవుతోందని, ఇంకా ఎంత మంది మరణిస్తే.. ప్రభుత్వం స్పందిస్తుందో చెప్పాలని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సారా మరణాలన్నీ వైఎస్ జగన్ హత్యలేననీ ఘాటూ వ్యాఖ్యలు చేశారు. జంగారెడ్డి గూడెం ఘటన విషయంలో సీఎం జగన్ రాజీనామా చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.
\శాసనమండలిలో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మరణాలపై ప్రభుత్వం ఎందుకు చర్చకు రావడం లేదని లోకేష్ ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలను సీఎం జగన్ సహజ మరణాలుగా పేర్కొన్నారనీ, సహజ మరణాలైతే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెం ఘటనపై నైతిక బాధ్యతగా సీఎం జగన్ రాజీనామా చేయాలని, న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా Jangareddygudemలో కల్తీ సారా తాగి చనిపోయారని ఆరోపిస్తున్న మృతుల సంఖ్య 19కి చేరింది. తాజాగా గుంటూరులోని ఆసుపత్రిలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ వరదరాజులు అనే వ్యక్తి మృతి చెందారు. మరోవైపు బాధిత కుటుంబసభ్యులు జంగారెడ్డిగూడెంలో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. నాటు సారా తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా తమ ఫిర్యాదును తీసుకోవటం లేదని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు.
