Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రంలో ‘జలగన్న’ ప్రభుత్వం నడుస్తోంది.. దివ్యవాణి

రాష్ట్రంలో రౌడీల రాజ్యం నడుస్తోందని, ఇది జగనన్న ప్రభుత్వం కాదు, ‘జలగ’న్న ప్రభుత్వమని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి విరుచుకుపడ్డారు. శనివారం ఆమె  మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

TDP spokesperson Divyavani press conference - bsb
Author
Hyderabad, First Published Jan 30, 2021, 1:20 PM IST

రాష్ట్రంలో రౌడీల రాజ్యం నడుస్తోందని, ఇది జగనన్న ప్రభుత్వం కాదు, ‘జలగ’న్న ప్రభుత్వమని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి విరుచుకుపడ్డారు. శనివారం ఆమె  మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది. బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఉన్మాద పరిపాలన సాగుతోంది. న్యాయపరమైన తీర్పు ఇచ్చిన న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు తెలపాల్సింది పోయి పిచ్చి కూతలు కూస్తున్నారంటూ మండిపడ్డారు. 

అందరి పరిస్థితి మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంటే జగన్ పరిస్థితి మాత్రం మూడు కేసులు, ఆరు నెలలు జైలు అన్నట్లుంది. ప్రశ్నిస్తే పిచ్చివాడని ముద్ర వేస్తారు. జగన్ జిత్తులమారి నక్కలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి, రెండు దొరక్కపోతే మెడకు వేస్తున్నారు. ప్రజల సొమ్మను దుర్వినియోగపరుస్తున్నారు. చంద్రబాబు హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధిపరిచారు. అక్కడి ప్రజలు ఆయన చలువ వల్ల సుఖసంతోషాలతో ఉన్నారు. పెట్టుబడులు లేని రాష్టంలో పెట్టుబడులు తెచ్చారన్నారు. 

జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సరైన సమయం ఆసన్నమైందని, అమ్మఒడి పథకం తెచ్చి సంవత్సరానికి 14 వేల రూపాయలు ఇస్తున్నామని చెబుతున్నారు. కరెంటు ఛార్జీల కింద సగటున 12వందలు వసూలు చేస్తున్నారు, పెట్రోల్ ధర పెంచేశారు. నిత్యవసర సరుకుల ధరలు అమాంతం పెంచేశారు. అందుకు నెల నెలా 3 వేల రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలే ఉండకూడదని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు మద్యం ఏరులై పారేలా చేస్తున్నారు. చీప్ లిక్కర్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీంతో వారికి సగటును 8 వేల రూపాయలు భారం పడుతోంది. ఆ టాక్సు, ఈ టాక్సు అని ప్రజల నెత్తిన బాదుతున్నారు. 

వివిధ ట్యాక్సు రూపేణ సగటు మనిషి నెలకు రెండు వేల రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తోంది. ఈ విధంగా నెల నెలా 14 వేల రూపాయలు వసూలు చేసి సంవత్సరానికి 14 వేలు ముఖాన కొడుతున్నారు.  గతంలో నిత్యవసర సరుకుల పంపిణీకి 7 వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేసేవారు. 

ప్రస్తుతం రేషన్ డీలరుకు 7వేల రూపాయలు, సరుకులు అందించే వాలంటీరుకు 5 వేల రూపాయలు,  వ్యాను డ్రైవరుకు పదివేలు, సరుకులు అందించే అసిస్టెంటుకు 2 వేలు, 32 వేలు ఖర్చు పెట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అభివృద్ధి లేదు, ప్రభుత్వానికి ఆదాయం లేదు, పెట్టుబడులు రావడంలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్రస్ లేకుండా పోయారంటూ చెప్పుకొచ్చారు. 

ప్రజల్ని మభ్యపెట్టి డబ్బులు గుంజుతున్నారు. జలగల్లా పీడిస్తున్నారు. కేంద్రం నుంచి తెస్తున్న నిధుల సమాచారం ప్రజలకు తెలియాలి. ఒక్క కంపెనీ రాలేదు.  అధ్వాన్నంగా మారిన రోడ్లు, రౌడీయిజాలు, రేషన్ బియ్యం ఒకప్పుడు ఉచితంగా లభించే ఇసుక నేడు బంగారంలా మార్చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీశారు. భవన నిర్మాణ కూలీల బతుకుల్ని బజారుపాలు చేశారు.  22 మంది ఎంపీలనిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఎంపీలను చేతకాని ఎంపీలుగా మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అమ్మఒడి పథకం ద్వారా సగం మంది మాత్రమే లబ్ది పొందుతున్నారు. అమరావతి రైతుల్ని రోడ్డుపైన కూర్చోబెట్టారు. కరోనా వచ్చి దాదాపు ఏడాదికి పైగా అవుతున్నా మీరు నివారణకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలి.  నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబునాయుడులది ఒకే డిఎన్ఏ అనడంలో అర్థంలేదని అన్నారు.

అజాతశత్రువు అని పేరు తెచ్చుకున్న జగన్ బాబాయి వివేకానందరెడ్డిని హత్య చేసి మసిపూసి మారేడుకాయ చేశారు. మీలా చంద్రబాబునాయుడు ఏ-1, ఏ-2గా పేరు తెచ్చుకోలేదు. ఐఏఎస్, ఐపీఎస్ లని జైల్లో కూర్చోబెట్టలేదు. రాష్ట్రాన్ని అధికార దాహంతో రెండో బీహార్ లా మార్చారు. జగన్ పరిపాలన సరిలేదు కాబట్టే టీడీపీ మేనిఫెస్టో తీసుకురావాల్సి వచ్చిందన్నారు. ఏలూరులో శుభ్రమైన మంచినీటిని అందించలేక పిట్టల్లా ప్రాణాలొదిలేలా చేశారని మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios