అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అండ్ కేబినెట్  చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై బురద చల్లుతున్నారని ఆరోపించారు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని. 

భవిష్యత్ లో వైయస్ జగన్ పాలన ఎంత భయంకరంగా ఉంటుందో ఈ నలభై రోజుల్లోనే తెలిసిపోయిందని విమర్శించారు. అవినీతి, అక్రమ ఆస్తుల కేసుల మచ్చ వైసీపీ నేతలకే ఉందన్నారు. అలాంటి అవినీతి మరకలు చంద్రబాబు నాయుడుపై బురదజల్లాలని ప్రయత్నిస్తే అది మీ జీవిత కాలం కూడా సరిపోదని యామిని విమర్శించారు. 

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అవినీతి జరిగిందని పదేపదే ఆరోపిస్తున్న వైయస్ జగన్ ఎందుకు పట్టుకోలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిని బయటపెడితే నజరానా ఇస్తానని అధికారులను మభ్యపెడుతున్నారని అయినా ఎవరూ కూడా అవినీతి జరిగిందని నిరూపించలేని పరిస్థితి నెలకొందన్నారు. 

చంద్రబాబు నాయుడు పాలనలో ఏనాడు కరెంట్ కోతలు లేవని కానీ వైయస్ జగన్ వచ్చిన తర్వాత కోతలు లేని రోజు లేదన్నారు. ఇచ్చిన హామీల కంటే ఎక్కువ హామీలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అంటూ సాధినేని యామిని కొనియడారు.