జగన్‌కు ఇద్దరు దత్తపుత్రులు..: టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి చేపట్టిన ప్రతి స్కీమ్‌లో స్కామ్ జరిగిందని మాజీ మంత్రి,టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి చేపట్టిన ప్రతి స్కీమ్‌లో స్కామ్ జరిగిందని మాజీ మంత్రి,టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ రంగంలో జగన్ ప్రభుత్వం భారీ స్కాంలకు పాల్పడుతోందని ఆరోపణలుచేశారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు కట్టబెట్టిన ట్రాన్స్ ఫార్మర్ల టెండర్లలో భారీ స్కామ్ జరిగిందని అన్నారు. ఈ మేరకు ఆయన పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వ పవర్ స్కామ్‌లన్నీ పార్టులు పార్టులుగా బయట పెడతామన్నామని చెప్పారు.
స్మార్ట్ మీటర్ల కుంభకోణాన్ని తాము బయటపెట్టామని తెలిపారు. ఇండో సోల్ సోలార్ సంస్థ వయస్సు కేవలం 18 నెలలు మాత్రమేనని, ఆ సంస్థను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి అందుకు బహుమతిగా రూ.75,706 కోట్ల విలువైన ప్రాజెక్టులు కట్టబెట్టారని సోమిరెడ్డి ఆరోపించారు. బ్లాక్ లిస్ట్ లో ఉండాల్సిన షిరిడిసాయి సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టడం వెనకున్న మతలబు ఏమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అరబిందో.. షిర్డీ సాయి అనేవి జగన్‌కు దత్తపుత్రులు అని విమర్శించారు. ఈ రెండు సంస్థలకు పుట్టిన విషపుత్రికే ఇండో సోల్ సోలార్ సంస్థ అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వంతో పోలిస్తే, ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ ను ఏపీ ప్రభుత్వం 2023లోనే 200, 300 శాతం అధిక ధరకు కొనడం వెనకున్న మర్మమేంటి? అని ప్రశ్నించారు. 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ధర టీడీపీ ప్రభుత్వంలో రూ. 58 వేలుంటే.. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం రూ. 79,829లకు కొంటే, జగన్ ప్రభుత్వం మాత్రం 223.98 శాతం ధర పెంచి, రూ.1,78,800లకు కొనడం దోపిడీ కాదా? అని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్ల కుంభకోణంపై హైకోర్టులో పిల్ వేశానని.. అది త్వరలో విచారణకు రాబోతోందని చెప్పారు. అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆధారపడే విద్యుత్ రంగంలో భారీ దోపిడీనా? అని ప్రశ్నించారు.దీని వల్ల ప్రజలపైనే భారం పడుతుందని అన్నారు. త్వరలోనే మూడు డిస్కంల పరిధిలో జరిగిన ఊహించని వ్యవహారాలను బయటపెడతానని అన్నారు. ఈ ప్రభుత్వంలోని కుంభకోణాలన్నీ బయటకొస్తే ముఖ్యమంత్రి జీవితకాలం జైల్లోనే ఉంటారని వ్యాఖ్యానించారు.