విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమరావతి అనే పేరు నచ్చలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. అందువల్లే అమరావతిని నిర్వీర్యం చేసేందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని... ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యానికి ఈ నిర్ణయమే నిదర్శనమన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమరావతి పేరు మార్మోగుతోందన్నారు. ఇలా అమరావతి అంటే చంద్రబాబు గుర్తొస్తారనే ఉద్దేశంతోనే జగన్ ఈవిధంగా వ్యవహరిస్తున్నట్టున్నారని రామయ్య పేర్కొన్నారు. 

''ముఖ్యమంత్రికి దేనిపైనా అవగాహన లేదు. తనకు తెలిసిందే వేదం, తాను మాట్లాడిందే సత్యం అన్నట్టుగా ఆయన వ్యవహారశైలి ఉంది. 29 గ్రామాల రైతులు 34 వేల ఎకరాల పొలాన్ని రాజధాని కోసం ఇచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో రైతులు రోడ్డునపడ్డారు. శాంతియుతంగా ఆందోళన మొదలుపెట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ తో పోరాటం చేస్తున్నారు'' అని గుర్తుచేశారు. 

''రాజధాని ఉద్యమం మొదలై ఏడాది కాబోతోంది. ప్రపంచంలో ఎక్కడా రైతు ఉద్యమం సంవత్సరం కొనసాగిన దాఖలాలు లేవు. పోలీసుల లాఠీదెబ్బలు తింటూ, అనేక ఇబ్బందులు పడుతూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. రాజధాని విశాఖలో ఉంటే ఉపయోగం లేదని ప్రజలు భావిస్తున్నారు. 12వ తేదీన ర్యాలీ చూసి ప్రభుత్వంలో వణుకు మొదలైంది. విజయవాడ ర్యాలీకి ప్రభుత్వం దిగిరావాల్సిందే. అమరావతి ఉద్యమం మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో బహిరంగ సభ జరగబోతోంది. వైసీపీయేతర పార్టీలంతా సభకు హాజరవుతాయి'' అని తెలిపారు. 

''ఉద్యమకారులకు మరింత ఉత్తేజం కలిగించేందుకు టీడీపీ మహిళా నేత సత్యవాణి పాట రూపొందించారు. నా చేతుల మీదుగా పాట ఆవిష్కరించే అవకాశం రావడాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నారు. ఈ పాట స్పూర్తితో అందరూ ముందుకెళ్లాలి. విజయవాడ ర్యాలీకి అందరూ తరలిరావాలి. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులకు కేంద్రం చర్చలు జరుపుతోంది. సంవత్సర కాలంగా అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారి కూడా చర్చలకు పిలవలేదు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

''ఎందుకు రైతుల మీద మీకంత పగ? ఈ ప్రాంతం మీకెందుకు నచ్చలేదు? ఎందుకు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పోకడ సరికాదు. నాకేంటి అని విర్రవీగిన నియంతలు కాలగర్భంలో కలిసిపోయారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తుచేసుకోవాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి'' అని వర్ల రామయ్య సూచించారు.