గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ. గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో వైసీపీ సోషల్ మీడియాపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. 

మాజీముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు మహిళా నేతలను కించపరుస్తూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. సోషల్ మీడియాలో పొందుపరుస్తున్న పోస్టుల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులను వైసీపీ సోషల్ మీడియా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై తగిన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య ఫిర్యాదులో కోరారు.