అనంతపురం జిల్లాలో తెలుగుదేశానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. గురువారం ధర్మవరంలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చించారు.

పార్టీని వీడాలని నిర్ణయించుకున్న ఆయన.. టీడీపీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖను పంపారు. సూరి పార్టీ మార్పుపై వార్తలు వచ్చిన నేపథ్యంలో అధిష్టానం బుజ్జగింపు చర్యలు చేపట్టింది.

అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు సూరితో భేటీ అయ్యారు. 2014 ఎన్నికల్లో ధర్మవరం నుంచి గెలిచిన సూరి తాజా ఎన్నికల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. పార్టీలో తనకు ప్రాధాన్యత లేకపోవడంతో పాటు పరిటాల కుటుంబ పెత్తనం పెరిగిపోవడం వల్లనే సూరి టీడీపీని వీడారని వార్తలు వస్తున్నాయి.