టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుకు గురవ్వడంతో బ్రహ్మయ్యను కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఆయన మార్గమధ్యంలోనే కన్నుమూశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఆయన ఒకసారి గుండెపోటుకు గురయ్యారు. ఫిబ్రవరిలో రాజంపేట పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయనకు గుండెపోటు రావడంతో బ్రహ్మయ్యను రమేశ్ హాస్పిటల్‌కు తరలించారు.

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి 1994, 1999లో బ్రహ్మయ్య వరుసగా రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికై, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మరణం పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.