వరుస షాక్‌లతో సతమతమవుతున్న తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి ఆయన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావిడి కనిపిస్తున్నా కరణం బలరామ్ మాత్రం నామినేషన్ల వ్యవహారానికి దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తన చిరకాల ప్రత్యర్ధి గొట్టిపాటి రవిని చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు.

Also Read:పార్టీ మార్పుపై తేల్చేసిన కరణం బలరాం

ప్రకాశం జిల్లాలో టీడీపీకి పెద్దతలకాయగా ఉన్న కరణం బలరామ్‌ను వైసీపీలో చేరేలాగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

ఇద్దరూ నేతలు కరణంను రేపు లేదా ఎల్లుండి జగన్ దగ్గరకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరణం బలరాంతో పాటు ఆయన కుమారుడు వెంకటేశ్ కూడా వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

గతంలోనూ కరణం బలరాం టీడీపీని వీడి వైసీపీలో చేరుతారని కూడ కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై అప్పట్లో కరణం బలరాం స్పందించారు. తన ఫేస్‌బుక్ లో ఈ మేరకు తన అభిప్రాయాలను ఆయన ప్రకటించారు. 

Also Read:బాబుకు సుజనా దెబ్బ: టీడీపీ ఎమ్మెల్యేలకు గాలం, కరణం బలరాంతో మంతనాలు

బెదిరిస్తే తాను పార్టీ మారనని తేల్చి చెప్పారు. బెదిరింపులకు లొంగేది లేదన్నారు. బెదిరిస్తే పార్టీ మారడానికి తనకు రాళ్ల వ్యాపారం లేదన్నారు. అంతేకాదు ఇసుక వ్యాపారం కూడ లేదని ఆయన  చెప్పారు.

పరోక్షంగా ఈ వ్యాఖ్యలు ఇదే జిల్లాకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే, తన ప్రత్యర్ధి గురించి చేసినవేననే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.కరణం బలరాం పార్టీ మార్పుపై చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.