ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదిగేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షం విలీనంతో జోష్ లో ఉన్న టీడీపీ ఆ తర్వాత ఇతర కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించింది.  

తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలంతా కాషాయి కండువా  కప్పేసుకున్న పరిస్థితి. అలాగే జనసేన పార్టీలో కీలకంగా ఉన్న నేతలను సైతం బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. బీజేపీలో చేరిన అనంతరం ఎంపీ సుజనాచౌదరి పార్టీలో చేరికలపై దృష్టిసారించారు. 

మహాత్మగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించకుని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు గాంధీ సంకల్పయాత్ర పేరుతో రాష్ట్రంలో బీజేపీ నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. ఎంపీ సుజనాచౌదరి కృష్ణా, గుంటూరు జిల్లాలలో గాంధీ సంకల్పయాత్రలు చేపడుతూనే మరోవైపు పార్టీలో చేరికలపై దృష్టిసారించారు. 

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తో భేటీ అయ్యారు సుజనా చౌదరి. గుంటూరులో సంకల్పయాత్ర చేస్తున్న సుజనాచౌదరిని వల్లభనేని వంశీ కలిశారు. అనంతరం కారులో ఇద్దరూ కలిసి ఒంగోలు వెళ్లిపోయారు. 

తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ తో ఎంపీ సుజనాచౌదరి రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒంగోలులోని ఓ ప్రైవేట్ హోటల్ లో ముగ్గురు కలిసి చర్చించుకుంటున్నట్లు తెలిపారు. 

ఇకపోతే గత కొద్దిరోజులుగా కరణం వెంకటేష్ తెలుగుదేశం పార్టీ వీడతారని ప్రచారం జరుగుతుంది. కరణం బలరాం సైతం వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని జగన్ కండీషన్ పెట్టడంతో ఆయన మిన్నకుండిపోయారు. 

అయితే కుమారుడు కరణం వెంకటేష్ ను వైసీపీలోకి పంపితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించిన కరణం బలరాం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తతం చీరాల ఎమ్మెల్యేగా ఉన్నారు కరణం బలరాం. 

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ కావడంతో ఆ పార్టీకి భవిష్యత్ లేదని కరణం బలరాం భావిస్తున్నారు. ఇకపోతే అద్దంకి నియోజకవర్గంలో మంచి పట్టున్న బలరాం తన కుమారుడిని అక్కడ నుంచి బరిలో దింపాలని వ్యూహరచన చేస్తున్నారు. 

అద్దంకి ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన గొట్టిపాటి రవికుమార్ కూడా వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో గొట్టిపాటి రవికుమార్ రాకముందే కరణం వెంకటేష్ ను వైసీపీలోకి పంపాలని బలరాం పావులు కదుపుతున్నారని ప్రచారం జరిగింది. 

తరతరాలుగా గొట్టిపాటి రవికుమార్ కుటుంబీకులతో రాజకీయ వైరం ఉండటంతో పాటు అద్దంకి సొంత నియోజకవర్గం కావడంతో తన కుమారుడిని వైసీపీలో చేరి అద్దంకిని తమ గుప్పెట్లో పెట్టుకోవచ్చని భావిస్తున్నారని తెలుస్తోంది. 

కరణం వెంకటేష్ వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో బీజేపీ ఎంపీ సుజనాచౌదరి రంగంలోకి దిగారు. కరణం వెంకటేశ్ ను వైసీపీలో చేరకుండా మోకాలడ్డుతున్నట్లు తెలుస్తోంది. కరణం బలరాంతోపాటు వెంకటేష్ ను కూడా బీజేపీలోకి రావాలంటూ ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరి కరణం బలరాం ఆయన తనయుడు కరణం వెంకటేష్ లు తెలుగుదేశం పార్టీలోనే ఉంటారా, కరణం బలరాం టీడీపీలోనే ఉంటూ వెంకటేష్ ను వైసీపీలోకి పంపిస్తారా అన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితి భవిష్యత్ లో కరణం బలరాంకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు చెప్తున్నారు. 
తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండాలని జగన్ కండీషన్ పెడితే బలరాం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని హెచ్చరించడంతో వైసీపీలో కొడుకును పంపే అంశంపై పునరాలోచనలో పడ్డారట. 

 అయితే బీజేపీ ఎంపీ వై సుజనా చౌదరి రంగంలోకి దిగడం కరణం బలరాం ఆయన కుమారుడితో భేటీ కావడంతో ప్రకాశం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీలోకి రావాలంటూ సుజనా సంప్రదింపులు జరుపుతున్నారా..? లేక ఇతర విషయాలపై చర్చిస్తున్నారా అన్నది వేచి చూడాలి.