అమరావతి: ఏపీ సీఎం వైయస్ జగన్ పై నిప్పులు చెరిగారు మాజీమంత్రి నక్కా ఆనందబాబు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల్లోనే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్న సీఎం జగన్ 40 లక్షల మంది పొట్టకొట్టారంటూ తిట్టిపోశారు. 

వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చి లక్షలాది మంది ఉద్యోగాలు పోగొట్టిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదేనని తిట్టిపోశారు. గత 4 నెలల్లో 40 లక్షల మంది ఉపాధిని జగన్ ప్రభుత్వం పోగొట్టిందని ఆరోపించారు. 

గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో అనేక అవకతవకలు జరిగినట్లు మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. గ్రామసచివాలయం ఉద్యోగాలకు సంబంధించి అవకతవకలపై విచారణ జరిపించాలని కోరుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని నిలదీశారు.  

గ్రామ సచివాలయం ఉద్యోగాల ఎంపికలో టాప్ ర్యాంక్‌లు వచ్చిన వారు మీడియాకు దూరంగా ఉండటంపై సందేహాలు వ్యక్తం చేశారు. మీడియాకు దూరంగా ఉండటం చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చేమోనన్నారు.  

నిరుద్యోగుల జీవితాలతో వైయస్ జగన్ ఆటలాడుకుంటున్నారంటూ మండిపడ్డారు. సమస్యలు చెప్పుకుంటే కేసులు పెడతారేమోనని భయపడే పరిస్థితి ప్రజలకు కల్పిస్తున్నారని మండిపడ్డారు. 

ఉపాధి హామీ పనులు పూర్తిగా నిలిపివేసి కూలీల పొట్టగొట్టారని ఆరోపించారు. పారదర్శక పాలన అనేది మాటలకే పరిమితమవుతోందని కానీ చేతల్లో మాత్రం పూర్తి విరుద్ధంగా ఉందన్నారు మాజీమంత్రి నక్కా ఆనందబాబు.