గుంటూరు: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కులఅహాంకారంతో వ్యవహరిస్తూ మరణం విషయంలో కూడా తనవర్గానికే కొమ్ముకాస్తున్నాడంటూ జగన్ పై టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్.ఎస్.రాజు ఆరోపించారు. తనపార్టీకి చెందిన దళిత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోతే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లకుండా పుట్టెడు దు:ఖంలో వున్న ఆయన కుటుంబసభ్యులనే సీఎం తనవద్దకు పిలిపించుకున్నాడని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు తన వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రామకృష్ణారెడ్డి చనిపోతే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి ఆఘమేఘాలపై  అవుకుకు వెళ్లాడన్నారు.

''దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులకు తిరుపతి ఉపఎన్నిక సీటు ఇవ్వకుండా మరోసారి దళిత కుటుంబాన్ని అవమానించాడు. కానీ చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా చనిపోతే ఆయన కుమారుడికి మాత్రం ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టడానికి సిద్ధమయ్యాడు. పరామర్శల్లో కూడా కులాన్నిచూసే అనైతికత, కుంచిత స్వభావమున్న ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం'' అని మండిపడ్డారు.

''దళితులను హింసిస్తున్న ముఖ్యమంత్రి వారి పక్షాన  నిలిచి నిలదీసే దళిత నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నాడు. దళితుల ప్రతిఘటన ఎలా ఉంటుందో, వారి సత్తా ఏమిటో జగన్మోహన్ రెడ్డికి తిరుపతి ఉప ఎన్నికలో రుచి చూపిస్తాం. దళిత మహిళ నాగమ్మ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న దళితనేతలను ఎక్కడైతే అడ్డగించి కేసులుపెట్టారో అక్కడనుంచే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దళితులనుంచి ప్రతిఘటన ఎదురుకానుంది'' అని హెచ్చరించారు.

read more  ఇకపై ఏ ఒక్క దేవాలయంపై దాడి జరిగినా ఊరుకోం: ఎమ్మెల్యే అనగాని హెచ్చరిక
    
''మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుని రామతీర్థం ఆలయ ఛైర్మన్ పదవినుంచి తొలగించిన దేవాదాయ మంత్రి వెల్లంపల్లి రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న ఘటనలకు బాధ్యతవహిస్తూ తానెందుకు మంత్రి పదవికి రాజీనామా చేయడం లేదు?  పేకాటాడితే కోర్టుల జరిమానా వేసి వదిలేస్తాయంటున్న మంత్రి కొడాలి నాని రేపు హత్యలు, వ్యభిచార కేంద్రాలను కూడా నిర్వహించేలా ఉన్నాడు. ముఖ్యమంత్రికి వాటాలు అందలేదనే కొడాలినాని నిర్వహణలోని పేకాటకేంద్రాలపై దాడులు జరిగాయి'' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

''పేకాట ఆడితే తప్పేమిటన్న కొడాలి నానీని, దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోని వెల్లంపల్లిని ముఖ్యమంత్రి ఎందుకు  మంత్రివర్గం నుంచి తొలగించడం లేదు. జగన్మోహన్ రెడ్డి వారిని సమర్థించడం చూస్తుంటే వారు సాగిస్తున్న చీకటి వ్యవహారాల్లో ఆయనకు కూడా వాటాలున్నట్టు అర్థమవుతోంది'' అని రాజు ఆరోపించారు.