అవిశ్వాస తీర్మానంపై లోకసభలో జరిగిన చర్చలో తెలుగుదేశం పార్టీ ప్రసంగంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెదవి విరిచారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చర్చను తన ప్రసంగంతో ప్రారంభించిన విషయం తెలిసిందే.
అమరావతి: అవిశ్వాస తీర్మానంపై లోకసభలో జరిగిన చర్చలో తెలుగుదేశం పార్టీ ప్రసంగంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెదవి విరిచారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చర్చను తన ప్రసంగంతో ప్రారంభించిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్య చేసే సమయానికి లోకసభలో టీడీపీ తరఫున గల్లా జయదేవ్ ఒక్కరే మాట్లాడారు. లోకసభలో టీడీపీ వాదనపై ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ శుక్రవారం స్పందించారు.
నేటి పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ వాదన చాలా బలహీనంగా, దుర్బలంగా ఉందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా డిమాండ్ పై పట్టుబట్టడానికి తగిన నైతిక బలం టీడీపికి లేదని ఆయన అన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి ప్రత్యేక హోదాను వ్యతిరేకించి, ప్రత్యేక హోదా డిమాండును బలహీనపరిచారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బిజెపి, టీడీపి వృధా చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల విలువైన సమయాన్ని, డబ్బును, వేదనను గుర్తించి డ్రామాలను ఆపి ప్రజల పక్షాన నిలబడి ఉండాల్సిందని అన్నారు.
వ్యక్తిగత లాభాల కోసం ‘స్పెషల్ క్యాటగిరి స్టేటస్’ కి మూడున్నర సంవత్సరాలుగా తూట్లు పొడిచి ఈ రోజు వ్యర్ధమైన ప్రసంగాలు చేసి ప్రయోజనం ఏమిటి? దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకి కేంద్రం వంచన తెలియటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే మేము నమ్మాలా?" అని పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదాపై సానుకూలంగా స్పందించాలని తాను ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున బిజెపి నేతృత్వంలోని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన మరో ట్వీట్ చేశారు. తమ హక్కులను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించడానికి పార్లమెంటును మించిన వేదిక ఉండదని ఆయన అన్నారు. దయచేసి న్యాయం చేయండని ఆయన కోరారు.
