Asianet News TeluguAsianet News Telugu

పొత్తులపై లేని స్పష్టత.. ఎప్పుడు ఎన్నిక‌లొచ్చినా విజ‌యం సాధించాల్సిందే: మ‌హానాడులో టీడీపీ తీర్మానం

ఒంగోలులో జరుగుతున్న మహానాడులో టీడీపీ పలు తీర్మానాలకు ఆమోదం తెలిపింది. వందేళ్లకు అనుగుణంగా నాయ‌క‌త్వాన్ని అందించేలా పక్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగాల‌ని తీర్మానించింది. అలాగే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం సాధించేలా పనిచేయాలని నిర్ణయించింది. 
 

tdp resolutions in mahanadu 2022
Author
Ongole, First Published May 27, 2022, 9:12 PM IST

ఒంగోలులో జరుగుతున్న మ‌హానాడులో (mahanadu) తెలుగుదేశం పార్టీ (telugu desam party) కీల‌క తీర్మానాల‌కు (resolutions) ఆమోదం తెలిపింది. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా విజ‌యం సాధించాల్సిందేన‌ని ఆ పార్టీ కీల‌క తీర్మానం చేసింది. అంతేకాకుండా వందేళ్ల‌కు స‌రిప‌డా నాయ‌క‌త్వాన్ని అందించేలా పక్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగాల‌ని కూడా టీడీపీ తీర్మానించింది. క్విట్ జ‌గ‌న్‌, సేవ్ ఏపీ పేరిట టీడీపీ (tdp) రాజ‌కీయ తీర్మానాన్ని ఆమోదించింది. 40 ఏళ్ల వేడుక‌లో మ‌రోమారు పోరాటానికి కార్యోన్ముఖులం అవుదామ‌ని ఆ పార్టీ తీర్మానించింది. 

రాజ‌కీయ శ‌క్తుల కుట్ర‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్న తీర్మానానికి కూడా టీడీపీ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టి.. ప్ర‌జ‌ల‌ను బాధ‌ల్లోకి నెట్టిన విధానాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని తీర్మానించింది. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ఉద్య‌మాలు చేప‌ట్టాల‌ని కూడా ఆ టీడీపీ తీర్మానం చేసింది. పార్టీకి దూర‌మైన వారిని చేరువ చేసుకునేందుకు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేయాల‌ని తీర్మానించింది. పార్టీ బ‌లోపేతానికి బ‌ల‌మైన వ్యూహాల ర‌చ‌న‌, వాటిని ప‌క‌డ్బందీగా అమ‌లు చేసేందుకు కూడా టీడీపీ తీర్మానించింది. అయితే వచ్చే ఎన్నికల దృష్ట్యా పొత్తులపై ఎలాంటి తీర్మానం చేయకపోవడం గమనార్హం. 

Also Read:జగన్ ప్రభుత్వంలో రెండు భారీ కుంభకోణాలు.. మహానాడు తర్వాత బయటపెడతా : నారా లోకేష్ సంచలనం

అంతకుముందు చంద్రబాబు నాయుడు (chandrababu naidu) మాట్లాడుతూ వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసిందని ఎద్దేవా చేశారు. సంక్షేమం లేదని, అంతా మోసకారి సంక్షేమమేనంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. పోలవరంలో (polavaram project) డయాఫ్రం వాల్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని... అక్కడ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 30 లక్షల ఇళ్లని చెప్పిన మీరు కట్టింది మూడే ఇళ్లని.. అడిగితే కేసులు పెడుతున్నారని, మీ కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవని చంద్రబాబు స్పష్టం చేశారు. వర్షాకాలంలో రోడ్లపై చేపలు పట్టేలా నీళ్లు ఉంటున్నాయని సెటైర్లు వేశారు. 

గొడ్డలిపోటును గుండెపోటని చెప్పి రాజకీయాలు చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎన్నికల ముందు కోడి కత్తి డ్రామా ఆడారని... ఒక్క ఛాన్స్‌ అంటే ప్రజలు నమ్మారని ప్రతిపక్షనేత గుర్తుచేశారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు (ysrcp mla anantha babu) హత్య చేశాడని... సమస్యను పక్కదారి పట్టించేందుకు కోనసీమ అల్లర్లు తీసుకొచ్చారని చంద్రబాబు ఆరోపించారు. కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. మంత్రిని కాపాడిన పోలీసులు ఇల్లు తగలబడకుండా ఎందుకు ఆపలేదని చంద్రబాబు ప్రశ్నించారు. 

మీరే దాడి చేసుకొని మీరే రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ సీట్లలో మూడింటినీ మరో రాష్ట్రం వాళ్లకు ఇచ్చారని.. సహ నిందితులకు సీట్లు ఇచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు.  25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారని.. పోలవరం ఏమైంది, విభజన హామీల అమలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. గెలిచిన తర్వాత కేంద్రం వద్ద మెడలు వంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని... జగన్‌ దిగిపోతే తప్ప మంచి రోజులు రావని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్‌ అండ్‌ కంపెనీ ఆదాయం పెరిగిందని... క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఏపీ నినాదం ప్రతి ఇంట్లో వినిపించాలని ప్రతిపక్షనేత పిలుపునిచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios