వైసీపీ ఎంపిలను ప్రత్యేకప్యాకేజి డిమాండ్ తో టిడిపి ఎంపిలే అడ్డుకుంటారన్న మాట.

మనకు శత్రువులు ఎక్కడో లేరు. ఒకరు అవునంటే, మరొకరు కాదనాల్సిందే. పార్లమెంట్ లో వైసీపీ ప్రత్యేకహోదా పోరుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కౌంటర్ మొదలుపెట్టారు. అంటే, హోదా కోసం పోరాటం చేయాలనుకున్న వైసీపీ ఎంపిలను ప్రత్యేకప్యాకేజి డిమాండ్ తో టిడిపి ఎంపిలే అడ్డుకుంటారన్న మాట. వాటే స్ట్రాటెజీ లోకేష్ బాబూ. రాష్ట్ర విభజన ఓటింగపుడు కూడా నరసరావుపేట ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఖమ్మం ఎంపి నామా నాగేశ్వర రావుతోనే టిడిపి నాయకత్వం దాడిచేయించింది. పార్లమెంట్ లో టిడిపి ఎంపిలు అనుసరించాల్సిన వ్యూహంపై టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం గుంటూరులో జరిగింది.

తన ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ, ఉభయ సభల్లోనూ ప్రత్యేక ప్యాకేజి చట్టబద్దతపై ఎంపిలు పట్టుపట్టాలని సూచించటం గమనార్హం. ప్రత్యేకహోదా కోసం యావత్ రాష్ట్రం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ప్యాకేజివైపే మొగ్గు చూపుతోంది. అందులోనూ కేంద్రం ప్రకటించని ప్యాకేజిపైన. హోదా కోసం రాష్ట్రం ఆందోళన చేస్తుంటే, సుమారు నాలుగు నెలల క్రితం కేంద్రమంత్రి జైట్లీ ప్రత్యేకసాయం(ప్యాకేజికాదు)పై అర్ధరాత్రి ప్రకటించారు. దాన్నే చంద్రబాబు మహాప్రసాదంగా కళ్ళకద్దుకున్నారు.

అంటే డిమాండ్ చేసిన హోదా రాలేదు. ఆశించిన ప్యాకేజీ కూడా రాలేదు. కొత్తగా సాయం అంటూ ఏదో తూతూ మంత్రంగా ప్రకటించి చేతులు దులుపుకున్నది కేంద్రం. జైట్లీ సాయం అని ప్రకటిస్తే, చంద్రబాబేమో ప్యాకేజి అని చెబుతున్నారు. మొత్తానికి ఏదీ లేకుండా రాష్ట్రానికి గుండుకొట్టటం ఖాయంగా కనిపిస్తోంది. ప్యాకేజికి చట్టబద్దత కల్పించాలని చంద్రబాబు అడుగుతుంటే, జైట్లీ ఇంత వరకూ స్పందించకపోవటానికి కారణమదే. ప్రతిపక్షాలు లేవనెత్తే హోదా కన్నా రాష్ట్రాభివృద్ధికి విడుదలవ్వాల్సిన నిధులపైనే దృష్టి పెట్టాలని లోకేష్ ఎంపిలకు సూచించటం గమనార్హం.

ఇక, పోలవరానికి నిధులు, ఎయిర్ పోర్టుల అభివృద్దికి కృషి చేసిన కేంద్రమంత్రులకు లోకేష్ అభినందనలు తెలపటం విచిత్రంగా ఉంది. పోలవరంకు కేంద్రం అదనంగా ఇచ్చిన నిధులేమీ లేవు. మొన్న మంజూరైన రూ. 1981 కోట్లు కూడా నబార్డ్ రుణమే. అది కూడా చెక్ పై రూ. 2400 కోట్లని ఉంటే ముఖ్యమంత్రి తదితరులు రూ. 1981 కోట్లే అని చెబుతున్నారు. మరి రూ. 500 కోట్లను ఏకాకి ఎత్తుకుపోయిందో?