Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు బిగ్ షాక్: బీజేపీ వైపు సుజనా, సీఎం రమేష్


రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపు పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారట. తనకు అత్యంత నమ్మకస్తుడైన సుజనాచౌదరి, సీఎం రమేష్ లు కూడా పార్టీ మారతారంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. సీఎం రమేష్, సుజనాచౌదరిలు పార్టీ మారితే మాత్రం టీడీపీకి గడ్డుకాలమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

tdp rajyasabha members  to join the BJP
Author
Amaravathi, First Published Jun 20, 2019, 8:00 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ నేతలు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. 

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతోపాటు లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవడంలో కూడా ఘోర పరాభవానికి పాల్పడటంతో గోడదూకేందుకు రెడీ అవుతన్నారు ఆ పార్టీ నేతలు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు నో చెప్పడంతోపాటు షెట్టర్లు క్లోజ్ చేయడంతో చేసేది లేక బీజేపీలో చేరాలని టీడీపీ కీలక నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు, మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు అయిన ఎంపీ సుజనాచౌదరి సైతం బీజేపీలో చేరతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. 

 తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మిలు బీజేపీలో చేరతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

సుజనాచౌదరి ఇప్పటికే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పొత్తులో భాగంగా సుజనాచౌదరి ఎన్డీఏలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 

కేంద్రమంత్రిగా పనిచేసిన సమయంలో బీజేపీకి చెందిన కీలక నేతలతో టచ్ లో ఉన్నారు. ఇకపోతే పొత్తు బెడిసికొట్టిన నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేయమన్న సందర్భంలో రాజీనామా చేసేందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు సుజనాచౌదరి. 

అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికీ బీజేపీ పెద్దలతో ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. 

ఇప్పటికే ఐటీ, సీబీఐ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు సుజనాచౌదరి. ఇటీవలే ఇడీ సైతం రంగంలోకి దిగి కొన్ని కోట్లాది రూపాయల ఆస్తులను సీజ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఎన్డీఏలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే మరోరాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీజీ వెంకటేశ్ చంద్రబాబు వైఖరిపై కాస్త అసంతృప్తితో ఉన్నారు. తనయుడికి టికెట్ ఇప్పించుకున్నా చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై ఆయన రగిలిపోతున్నారట. 

ఈ నలుగురు రాజ్యసభ సభ్యులతోపాటు కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కాషాయపార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లాకు చెందిన ఒక మాజీ ఎంపీ, కొందరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది.  

రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపు పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారట. తనకు అత్యంత నమ్మకస్తుడైన సుజనాచౌదరి, సీఎం రమేష్ లు కూడా పార్టీ మారతారంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. సీఎం రమేష్, సుజనాచౌదరిలు పార్టీ మారితే మాత్రం టీడీపీకి గడ్డుకాలమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios