Asianet News TeluguAsianet News Telugu

అది సంతోషం, వాటినీ గుర్తించండి: వైఎస్ జగన్ కు చంద్రబాబు లేఖ

విశాఖను మెడ్ టెక్ జోన్ గా గుర్తించడం ముదావహమని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాసిన లేఖలో అన్నారు. చంద్రబాబు జగన్ కు రాసిన లేఖ పూర్తి పాఠం...

TDP president Nara Chandrababu Naidu writes letter to AP CM YS Jagan
Author
Amaravathi, First Published Apr 9, 2020, 8:30 AM IST

కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. విశాఖను మెడ్ టెక్ జోన్ గా గుర్తించడం సంతోషకరమని అంటూ అన్నా క్యాంటీన్లను, ఇతరాలను కూడా గుర్తించాలని ఆయన కోరారు. చంద్రబాబు జగన్ కు రాసిన లేఖ పూర్తి పాఠం కింద ఇస్తున్నాం...

1)విశాఖ మెడ్ టెక్ జోన్ ప్రాధాన్యత గుర్తించడం ముదావహం: 

దేశంలోనే తొలి మెడికల్ ఎక్విప్ మెంట్ తయారీ పార్క్ గా విశాఖపట్నంలో నెలకొల్పిన మెడ్ టెక్ జోన్ ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించడం ముదావహం. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టి, ముందుచూపు ఆలోచనలే ప్రస్తుత మెడ్ టెక్ జోన్ పనితీరుకు నిదర్శనాలు. ప్రస్తుత సంక్షోభంలో 55నిముషాల్లోనే కరోనా నిర్ధారణ చేసేలా టెస్టింగ్ కిట్ల తయారీకి విశాఖ మెడ్ టెక్ జోన్ వేదిక కావడం శుభపరిణామం. రోజుకు 2వేల కిట్ల తయారీ సామర్ధ్యం ఈ నెలాఖరుకు 25వేల కిట్ల తయారీకి, మే నెలాఖరుకు ఏడున్నర లక్షల కిట్ల తయారీకి చేరుకోవడం ప్రస్తుత కరోనా కారుచీకట్లో నిజంగా కాంతిరేఖలే. 3వేలకు పైగా వెంటిలేటర్లు, వైద్య సిబ్బందికి కావాల్సిన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పిపిఈ) మన మెడ్ టెక్ జోన్ లో యుద్దప్రాతిపదికన తయారీ చేయడం ముదావహం.  

ఈ 10నెలలు దానిని నిర్లక్ష్యం చేయకుండా, మరింత అభివృద్ది చేసినట్లయితే ప్రస్తుత కరోనా సంక్షోభంలో దేశానికే మరింత మెరుగైన సేవలు అందించే స్థాయిలో ఉండేది. మరిన్ని కంపెనీలు మెడ్ టెక్ జోన్ కు రావడమే కాకుండా, దేశానికి కావాల్సిన మెడికల్ ఎక్విప్ మెంట్ అందుబాటులోకి వచ్చేది. గత ప్రభుత్వంపై అక్కసుతో, పదేపదే అవాస్తవ ఆరోపణలతో, ఎంక్వైరీల పేరుతో తొలి ఏడాది విలువైన కాలాన్ని వృధా చేశారు. మయసభగా మెడ్ టెక్ జోన్ ను విమర్శించిన వాళ్లే ఇప్పుడు దేశానికే గర్వకారణంగా చెప్పడం ఆనంద దాయకం. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఏడాది ఆలస్యంగా అయినా మెడ్ టెక్ జోన్ ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం సంతోషకరం. 

2) మెడ్ టెక్ జోన్ తరహాలోనే ఈ వ్యవస్థలను(అన్నా కేంటిన్లు, చంద్రన్న బీమా, ఆర్టీజిఎస్)కూడా పునరుద్దరించాలని, బలోపేతం చేయాలని విజ్ఞప్తి: 

ఎ) అన్నా కేంటిన్ల పునరుద్దరణతో పేదలకెంతో మేలు: 

అన్నా కేంటిన్లను కూడా పునరుద్దరించే ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. రెక్కాడితే గాని డొక్కాడని లక్షలాది రోజు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, నిరుపేదల ఆకలిదీర్చే అన్నా కేంటిన్లను రాజకీయ కక్షతో మూసివేయడం తగనిపని. అన్నా కేంటిన్లే గనక ఉండి ఉన్నట్లయితే ఇప్పుడీ కరోనా సంక్షోభంలో పేదలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండేవనేది ప్రజల్లో నెలకొన్న విస్తృతాభిప్రాయం. కేరళలో పీపుల్ కేంటిన్లు, కర్ణాటకలో ఇందిరా కేంటిన్లు, హైదరాబాద్ లో అన్నపూర్ణ కేంటిన్ల విజయగాథల స్పూర్తితో అయినా మన రాష్ట్రంలో అన్నా కేంటిన్లను తక్షణమే పునరుద్దరించాలని కోరుతున్నాం. 

బి)‘‘బీమా పథకం’’ ఉంటే కరోనా మృతుల కుటుంబాలకు ఆదరవు అయ్యేది: 

కరోనా మహమ్మారి బారిన పడి, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అనారోగ్యంతో అల్లాడుతున్నారు, వేలాది ప్రజలు బలి అయ్యారు. అనేక కుటుంబాలు అనాధలుగా మారాయి. మనదేశంలో, రాష్ట్రంలోనూ కరోనా విధ్వంసం విస్తృతరూపం దాల్చింది. ఈ పరిస్థితుల్లో ‘‘బీమా పథకం’’ రద్దు చేయకుండా కొనసాగించివుంటే, ఆయా కుటుంబాలకు ఎంతగానో అక్కరకు వచ్చేది. 

ప్రత్యామ్నాయంగా కొత్తపథకం తేకుండానే రాష్ట్రంలో ‘‘చంద్రన్న బీమా’’ పథకాన్ని అర్ధంతరంగా రద్దు చేయడం అనాలోచిత చర్య. ఇప్పుడదే పథకం ఉండివుంటే, కరోనా బాధిత కుటుంబాలకు అండగా ఉండటంతో పాటు, భవిష్యత్ పై ఎంతో భరోసాగా ఉండేది. కాబట్టి తక్షణమే ‘‘బీమా పథకాన్ని’’ పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నాము. 

సి)ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ‘‘ఆర్టీజి’’ ఎంతో ఉపయోగకరం:  

అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గాడితప్పిన రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజి)కి నూతన జవసత్వాలు కల్పించి మళ్లీ సమర్ధంగా నిర్వహించాలి. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే ఆర్టీజి వల్ల గత ప్రభుత్వంలో ఎన్నో సత్ఫలితాలు సాధించాం. 
తిత్లి తుపాన్ విపత్తులో, ఇతర సంక్షోభ సమయాల్లో ప్రభుత్వ సమాచారం ప్రజలకు చేరవేసేందుకు, ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చి సకాలంలో త్వరితగతిన పరిష్కరించేందుకు ఆర్టీజి ఎంతగానో దోహదపడింది. ప్రస్తుత కరోనా సంక్షోభంలో కూడా ఆర్టీజిని మరింత సమర్ధంగా వినియోగించుకుని వుంటే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అంతరం ఉండేది కాదు. 

కాబట్టి రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజి) వ్యవస్థను వెంటనే పునరుద్దరించాలి, మరింత బలోపేతం చేయాలని సూచిస్తున్నాం. 

3)మద్దతు ధర చెల్లించి పంట ఉత్పత్తులన్నీ కొని రైతులను ఆదుకోవాలి:

కరోనా లాక్ డౌన్ కారణంగా కూలీలు దొరకక, లారీలు లేక, రవాణా స్థంభించి కనీస మద్దతుధర లభించక రాష్ట్రంలో ధాన్యం రైతులు, పత్తి, మిర్చి, హార్టీకల్చర్, ఆక్వా రైతాంగం, ఫౌల్ట్రీ, సెరికల్చర్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టి ఆయా రంగాల రైతులను ఆదుకోవాలి. 

4) ప్రతి పేద కుటుంబానికి రూ 5వేల ఆర్ధిక సాయం అందించాలి: 

లాక్ డౌన్ తో పనులు కోల్పోయి జీవనం దుర్భరంగా మారిన రైతు కూలీలు, అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కూలీలు, చేనేత, గీత కార్మికులు, మత్స్యకారులు, ఇతర చేతివృత్తులవారు, ఎస్సీ,ఎస్టీ వర్గాల వారికి తక్షణమే, కుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించి ఆదుకోవాలి.  

5) వ్యవస్థల నిర్మాణం చాలా కష్టం, విధ్వంసం సులభం: 

వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది. వ్యవస్థల నిర్మాణం చాలా కష్టం, వాటి విధ్వంసం చాలా సులభం. వ్యక్తి చేయలేని పనిని ఒక వ్యవస్థ ద్వారా చేయవచ్చు. మరింత మెరుగ్గా, సమర్ధంగా ప్రజలకు సేవలు అందించవచ్చు. 

దప్పిక అయినప్పుడే బావిని తవ్వాలనే ధోరణి విజ్ఞత కాదు. నిర్మాణం చేసేవాళ్లనే ప్రజలు పదికాలాలు గుర్తుంచుకుంటారు. విధ్వంసం చేసేవాళ్లు చరిత్రగతిలో తెరమరుగు అవుతారు. 

వీటన్నింటిని గుర్తుంచుకుని ఇకనైనా రాష్ట్రంలో విధ్వంసాలకు స్వస్తి చెప్పి వ్యవస్థల నిర్మాణంపై, వాటి బలోపేతంపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము. నిర్మాణ దృక్ఫథంతో, భవిష్యత్ తరాలకు సరైన దిశా నిర్దేశం చేయడమే పాలనాధర్మంగా తెలియజేస్తున్నాను. 

నారా చంద్రబాబు నాయుడు
(తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేత)

Follow Us:
Download App:
  • android
  • ios