అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై లేఖాస్త్రాలు సంధిస్తున్నారు మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇటీవలే జగన్ కు లేఖ రాసిన చంద్రబాబు నాయుడు తాజాగా మరో లేఖ రాశారు.  

నరేగా పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని లేఖలో స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల కాలంలో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

 కూల్చివేతలు, ఒప్పందాల రద్దులతో ప్రభుత్వ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారిందని లేఖలో ఆరోపించారు. కూల్చివేతలు, ఒప్పందాలు రద్దు, కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప పాలనపై జగన్ ఏనాడూ దృష్టి సారించడం లేదన్నారు. 

ఇకపోతే నరేగా పనులపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని లేఖలో కోరారు. తక్షణమే ఉపాధిహామీ పథకానికి నిధులు విడుదల చేయాలని లేఖలో చంద్రబాబు కోరారు.  ప్రాధాన్యతాక్రమంలో పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.