అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అభివృద్ధి చెందుతున్న మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మెుదటి స్థానంలో ఉండేదని అలాంటి రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. 

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మెుదటి స్థానంలో ఉందన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ఆరోపించారు చంద్రబాబు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండురోజుల పర్యటనలో భాగంగా తణుకులో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు అనంతరం మీడియాతో మట్లాడారు. 

ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైన ప్రాజెక్టు అమరావతి అని చెప్పుకొచ్చారు. బంగారు బాతులాంటి రాజధాని అమరావతిని చంపేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వైపు పలు దేశాలు సైతం ఆసక్తిగా ఎదురుచూశామని అయితే దాన్ని జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. 

అమరావతిని సక్రమంగా నిర్వహిస్తే మెుదటి ఏడాది లక్ష కోట్లు ఆదాయం వచ్చేదని రెండో ఏడాది రెండు లక్షల కోట్లు వచ్చేదని చెప్పుకొచ్చారు. రాజధాని ఏర్పాటుకు సుమారు 33,500 ఎకరాల భూమిని రైతులు ఇస్తే ప్రభుత్వ భూమితో కలిసి మెుత్తం 50వేల ఎకరాలకు చేరుకుందన్నారు. 

ప్రపంచం అంతా అమరావతి రాజధానిపై ఆరా తీసిందని చెప్పుకొచ్చారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా భూములు అప్పగించినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. రాజధానికి సంబంధించి అన్ని కట్టడాలు పూర్తికాగా 10వేల ఎకరాల భూమి మిగిలుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

10వేల ఎకరాల్లో ఎవరికైనా ఇళ్లు లేకపోతే వారికి ఇల్లుకట్టేందుకు 500 ఎకరాలు రిజర్వ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. దాదాపుగా 50వేల ఇళ్లు నిర్మించుకోవచ్చన్నారు. ఇప్పటికిప్పుడు స్థలాలను అమ్ముకుంటే లక్ష కోట్లు వచ్చేదని చెప్పుకొచ్చారు. వరల్డ్ క్లాస్ సిటీ కావాల్సిన అమరావతిని నాశనం చేశారంటూ చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. 

తాను గతంలో ఆలోచించి అన్ని చేశాను కాబట్టే హైదరాబాద్ కు ఒక ఎయిర్ పోర్ట్, హెచ్ఆర్ డీ, అనేక కళాశాలలు తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి 60 శాతం నిధులు తాను నిర్మించిన రాజధాని నుంచే అందుతుందన్నారు. 

ఆనాడు తన తర్వాత వచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకిస్తే హైదరాబాద్ నిర్మించబడేదా అని నిలదీశారు చంద్రబాబు నాయుడు. డబ్బులు లేవంటూ అమరావతి రాజధాని నిర్మాణం ఆపేసే కుట్ర చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఈరోజు వైసీపీ అధికారంలో ఉంది తర్వాత వేరొక పార్టీ ఉండొచ్చు కానీ ప్రజలు అలాగే ఉంటారని ప్రజలే నష్టపోతారన్నారు చంద్రబాబు నాయుడు. 

రాజధాని నిర్మాణం ఆపేయడం వల్ల ప్రపంచం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుందని మండిపడ్డారు. ఇటీవలే ప్రముఖ వ్యాపారవేత్త మోహన్ దాస్ కందాయ్ తోపాటు ఇతర వ్యాపారవేత్తలు సైతం జగన్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ లు సైతం జగన్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందేనని చెప్పుకొచ్చారు. జగన్ వ్యవహార శైలివల్లే రాజధాని నుంచి సింగపూర్ లాంటి కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయని చంద్రబాబు విమర్శించారు. 

సింగపూర్ కు చెందిన కంపెనీలు స్టార్ట్ అప్ ప్రోగ్రామ్ కింద నిర్మాణాలు చేపడుతుంటే వారిని వెనక్కిపంపేసిందన్నారు. సింగపూర్ లాంటి కంపెనీలు వెనక్కి వెళ్లిపోవడంతో రాష్ట్రవ్యహారశైలిపై కేంద్రంసైతం ఆగ్రహంగా ఉందన్నారు. 

అమరావతి రాకూడదనే ఉద్దేశంతో కమిటీలపై కమిటీలు వేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు చంద్రబాబు నాయుడు. జగన్ వ్యవహారశైలి వల్ల అమరావతిని కోల్పోయామని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు బాతుగుడ్డు పెట్టే అమరావతిని చంపేశారంటూ విరుచుకుపడ్డారు. 

ఇసుకవారోత్సవాలు రేపటితో ముగుస్తుందని ఇప్పటికీ కూడా ఇసుక దొరకడం లేదని చంద్రబాబు ఆరోపించారు. ఎందుకు ఇసుకపై, మట్టిపై పెత్తనం చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. వైసీపీ నేతలు ఇసుక, మట్టి మాఫియా చేస్తున్నారని వారి లారీలను పట్టుకుంటే మైనింగ్ లారీలు అంటూ తప్పించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ వాళ్లు అటువైపుగా వెళ్తే కేసులు రాస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

ఇసుకను ఉచితంగా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఎవరికి కావాల్సిన ఇసుకను వారికి అందజేయాలని డిమాండ్ చేశారు. ఇసుకమాఫియాను ఎందుకు అరికట్టలేకపోతున్నారని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇసుక దొరుకుతుంది గానీ రాష్ట్రంలోని ప్రజలకు మాత్రం దొరక్కపోవడం బాధాకరమన్నారు.