అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొట్టనబెట్టుకుందని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చూస్తుంటే బాధేస్తోందన్నారు. రాష్ట్రంలో ఉన్న 65 లక్షల మంది టీడీపీ కార్యకర్తలను తాను కాపాడుకుంటామని తెలిపారు. 

37 ఏళ్ళ తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రలో ఏనాడు దౌర్జన్యం చేయలేదు, దౌర్జన్యాలు కూడా తమకు చేతకాదన్నారు. తెలుగుదేశం పార్టీకి అధికారం, ప్రతిపక్షం కొత్తేమీ కాదన్నారు.   ప్రజల ఆస్తులను రక్షించాలంటూ పోలీస్ వ్యవస్థను, ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. 
 
మరోవైపు త్వరలోనే చంద్రబాబు నాయుడు పరామర్శ యాత్ర చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ దాడుల్లో చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఓదార్చేందుకు చంద్రబాబు నాయుడు పరామర్శ యాత్ర చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటి వరకు రాజకీయ దాడుల్లో 6గురు టీడీపీ కార్యకర్తలు చనిపోయినట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు రూ.5లక్షలు పరిహారం ప్రకటించారు. వాటిని పరామర్శయాత్రలో అందజేయనున్నట్లు తెలుస్తోంది. 

మంగళవారం, బుధవారం రెండు రోజులపాటు చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. పర్యటన అనంతరం ఉండవల్లి చేరుకుంటారు. ఉండవల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది.