అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఓటమిపై పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని సూచించారు. 

ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు పార్టీ నేతల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓడిపోయామని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

టీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రస్థానం ఒక్కసీటుతో ప్రారంభమైందని అలాంటి పార్టీ నేడు రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ప్రజాసమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల మధ్యే ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇకపోతే సానుభూతితోనే జగన్ గెలిచారని అభిప్రాయపడ్డారు.