అమరావతి: రాష్ట్రంలో బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అనేక జిల్లాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని అన్నారు. 

దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలోని కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలపై చర్చించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పలు సూచనలు సలహాలు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలు, పలు ప్రాజెక్టుల పనులు నిలిపివేయడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. 

పోలవరం, రాజధాని నిర్మాణం, కీలక ప్రాజెక్టులపై కీలక ఆరోపణలు చేస్తూ ఆ పనులను నిలిపివేయాలని నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఆరోపణలు చేస్తూ, ప్రాజెక్టు పనులను నిలిపివేయడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెల్లే అవకాశం ఉందన్నారు. 

మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం రద్దుపై కూడా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం ద్వారా ఒక సీజన్ రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు సూచించారు. 

అలాగే రైతులకు ఆఖరి రుణవిడత మాఫీ పూర్తి చేయాలని చంద్రబాబు జగన్ ప్రభుత్వానికి సూచించారు. ఇకపోతే ఈనెల 15న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పోటీచేసిన అభ్యర్థులతో వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.