విశాఖపట్టణం:అరకు పార్లమెంట్  నియోజకవర్గం నుండి  ఈ దఫా ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై టీడీపీ నాయకత్వం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల వైసీపీ ఎమ్మెల్యేలు కూడ వైసీపీ నుండి టీడీపీలో చేరారు. దీంతో టీడీపీకి కొంత బలం పెరిగిందని ఆ పార్టీ భావిస్తోంది. అరకు పార్లమెంట్ సెగ్మెంట్‌ను కైవసం చేసుకొనేందుకు గాను టీడీపీ పావులు కదుపుతోంది.

2014 ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకొంది. అరకు ఎంపీ స్థానం నుండి వైసీపీగా విజయం సాధించిన కొత్తపల్లి గీత  ఆ పార్టీకి దూరంగా ఉంటోంది. ఈ స్థానం నుండి  ఆమె మరోసారి పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

విశాఖ జిల్లాలోని అరకు ఎంపీ సెగ్మెంట్ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలో విస్తరించి ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, విజయనగరం  జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు, విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు, తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

వచ్చే ఎన్నికల్లో  ఈ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు టీడీపీ ఇప్పటి నుండి ప్లాన్ చేస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలోని  వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ, అరకు ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. గత ఏడాదిలో సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపారు. సర్వేశ్వరరావు మృతితో ఆయన కొడుకు శ్రవణ్‌కుమార్ ‌ను చంద్రబాబునాయుడు తన కేబినెట్‌లోకి తీసుకొన్నారు.

గత ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్ధిగా గుమ్మడి సంధ్యారాణి, కాంగ్రెస్ అభ్యర్ధిగా కిషోర్ చంద్రదేవ్, వైసీపీ అభ్యర్ధిగా కొత్తపల్లి గీత పోటీ చేశారు.త్రిముఖ పోటీలో కొత్తపల్లి గీత విజయం సాధించారు. విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మెన్‌గా కొనసాగుతున్న డాక్టర్  స్వాతిరాణి అరకు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

డాక్టర్ స్వాతి రాణి పేరుతో పాటు ఐఎఎస్ అధికారి టి.బాబురావునాయుడు పేరును కూడ టీడీపీ  పరిశీలిస్తోందని ఆ పార్టీ వర్గాల్లో  ప్రచారం సాగుతోంది. బాబూరావు నాయుడు గిరిజన సహకార సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విశాఖపట్నంలోనే విధులు నిర్వహిస్తున్నారు.

సాలూరులో పనిచేస్తున్న బ్యాంకు అధికారి ఒకరు అవకాశం ఇస్తే పోటీ చేయాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం. తండ్రి రిటైర్డ్‌ పోస్టుమాస్టర్‌. కుటుంబమంతా విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో స్థిరపడింది. ఆయన మూడు జిల్లాల్లోను బ్యాం కులో వివిధ హోదాల్లో సేవలు అందించారు.

అరకు పార్లమెంట్ సెగ్మెంట్ నుండి  వైసీపీ అభ్యర్ధిగా  ఎవరు పోటీ చేస్తారో అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. కృష్ణబాబు అనే టీచర్ ఈ స్థానంలో  పోటీకి ఆసక్తిగా ఉన్నారు.పాడేరు అసెంబ్లీ నుండి  అరకు పార్లమెంట్ స్థానం నుండి  మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేన నుండి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు.