పుంగనూరు, అంగళ్ళులో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సిబిఐ విచారణ జరిపించాలని టిడిపి కోరుతోంది. 

అమరావతి : చిత్తూరు జిల్లా పుంగనూరు, అన్నమయ్య జిల్లా అంగళ్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారకులు మీరంటే మీరంటూ అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అసలు ఈ దాడుల వెనకున్నది ఎవరనేది తేలాలంటే విచారణను సిబిఐకి అప్పగించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు అంగళ్లు, పుంగనూరు ఘటనలపై సిబిఐతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు టిడిపి సిద్దమయ్యింది. 

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనల్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వానికి పిర్యాదు చేయాలని టిడిపి నిర్ణయించింది. ఇందుకోసం 11మంది నాయకులతో కూడిన బృందాన్ని దేశ రాజధాని డిల్లీకి పంపిస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ బృందం డిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వైసిపి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేయనున్నారు. ఇలా వైసిపి వాళ్లే దాడులకు పాల్పడి తిరిగి తమ నాయకులపైనే కేసులు బనాయించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పుంగనూరు, అంగళ్లు ఘటనలపై సిబిఐ విచారణ కోరనున్నారు. 

ఇప్పటికే టిడిపి బృందం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ల అపాయిట్మెంట్ కోరినట్లు సమాచారం. ఒకవేళ పార్లమెంట్ సమావేశాల కారణంగా వారిని కలిసే అవకాశం లేకున్నా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు టిడిపి బృందం డిల్లీ పర్యటన ఇవాళ లేదా రేపు ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

Read More కాల్పులు జరగాలన్నదే చంద్రబాబు కుట్ర.. చర్యలు తప్పవు, ఆధారాలతో సహా దొరికిపోయారు : సజ్జల సంచలన వ్యాఖ్యలు

ఇదిలావుంటే పుంగనూరు, అంగళ్లులో తనపై జరిగిన దాడులపై సాధాసీదావేమీ కాదని... ప్రాజెక్టుల సందర్శనకు వెళుతున్న తనను వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు పథకం ప్రకారము అడ్డుకున్నాయని చంద్రబాబు అన్నారు. తనను చంపాలన్న కుట్రలో భాగమే ఈ దాడిగా చంద్రబాబు పేర్కొన్నారు. తనపై హత్యాయత్నం చేస్తే అందరూ భయపడుతారనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదంతా చేయించాడని అన్నారు. అందుకే పుంగనూరు, అంగళ్లు ఘటనలపై సిబీఐతో సమగ్రంగా విచారణ జరిపించి తనపై దాడిలో ఇంకా ఎవరెవరి పాత్ర వుందో తేల్చాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. 

రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెడుతున్నందుకే తనపై దాడి చేశారన్నారు చంద్రబాబు. తన కార్యక్రమాన్ని వైఎస్ఆర్‌సీపీ అడ్డుకుందని చెప్పారు. తనపై దాడి చేసేందుకు వచ్చి తిరిగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు.అంగళ్లులో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులను పోలీసులు ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే తనను చంపేందుకే ఈ దాడి జరిగినట్లు అర్థమవుతోందని చంద్రబాబు అన్నారు.