విజయవాడ: తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీమోహన్ రాజీనామా చేయడంతో కృష్ణా జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వంశీని రాజీనామా చేయకుండా ఆపేందుకు, టీడీపీలోనే కొనసాగేలా టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇక టీడీపీ వంశీపై ఆశలు వదులుకుంది. 

అయితే వైసీపీ వేవ్ లో కూడా తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గంలో విజయం సాధించడంతో ఆ స్థానాన్ని ఉపఎన్నికల్లో తిరిగి దక్కించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నారు. 

వంశీ రాజీనామా అనంతరం చంద్రబాబు నాయుడు ఐదుగురు సభ్యుల జాబితా తయారు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం నియోజకవర్గానికి ఆరు నెలల్లో ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో అక్కడ అభ్యర్థిని నిలబెట్టే అంశంపై చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి వచ్చారు. 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా గద్దె అనురాధ, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, దేవినేని అవినాష్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా మాజీమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరు తెరపైకి వచ్చింది. 

నారా లోకేష్ ను టీడీపీ కంచుకోట అయిన గన్నవరం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో టీడీపీలో చర్చ జరుగుతుందట. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక దుమారం చెలరేగుతోంది. 

అన్ని రాజకీయ పార్టీలు ఇసుక కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నాయి. ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వేదికగా లాంగ్ మార్చ్ నిర్వహిస్తే విజయవాడ కేంద్రంగా బీజేపీ ఇసుక సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. 

అంతకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు గానీ లోకేష్ దీక్షకు గానీ, బీజేపీ ఇసుక సత్యాగ్రహ దీక్షలు సక్సెస్ కావడంతో ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ భావిస్తోంది. 

ఈ పరిణామాల నేపథ్యంలో నారా లోకేష్ ను రంగంలోకి దించితే టీడీపీ విజయం ఖాయమని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతోపాటు టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులు, కేసులు వంటి అంశాల  నేపథ్యంలో తెలుగుదేశంపై ప్రజల్లో సానుభూతి ఉందని కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారట. 

ఈ అంశాలనే ఉపఎన్నికల్లో ప్రచార అస్త్రాలుగా సంధిస్తే టీడీపీ విజయం ఖాయమని పార్టీలోని కొందరు నేతలు భావిస్తున్నారట. ఇకపోతే నారా లోకేష్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి జిల్లా నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 

ఒకవేళ నారా లోకేష్ సుముఖంగా లేకపోతే గద్దె అనురాధనే బరిలోకి దించాలని పార్టీలోని కొందరు నేతలు భావిస్తున్నారు. గద్దె అనురాధ లేకపోతే దేవినేని అవినాష్, దేవినేని ఉమామహేశ్వరరావులలో ఎవరో ఒకరిని బరిలోకి దించిన ఫలితం ఉంటుందనే భావిస్తున్నారు టీడీపీ నేతలు. 

మెుత్తానికి టీడీపీకి కంచుకోట అయిన గన్నవరం నియోజకవర్గంలో మళ్లీ టీడీపీ జెండాయే ఎగురవేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. 

మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలని కృష్ణా జిల్లా వైసీపీ నేతలు సైతం పట్టుదలతో ఉన్నారు. కృష్ణా జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం ఉపఎన్నిక వస్తే ఎవరిని బరిలోకి దించాలనే అంశంపై కూడా కసరత్తు మెుదలుపెట్టినట్లు తెలుస్తోంది. 

అటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం గన్నవరం నియోజకవర్గం ఉపఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తున్నారట. ఇటీవలే జనసేన పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి మద్దతు వస్తున్న తరుణంలో అభ్యర్థిని బరిలోకి దించితే బాగుంటుందని జనసైనికులు భావిస్తున్నారట. 

ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైతే కృష్ణా జిల్లా రాజకీయం మరింత వేడెక్కనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గన్నవరం వేదికగా మరో పొలిటికల్ సంగ్రామం జరగబోతుందని ప్రచారం జరుగుతుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

వల్లభనేని వంశీ ఫ్యాక్టర్: టీడీపీలో కుమ్ములాటలు, చంద్రబాబుకు అగ్నిపరీక్ష

వంశీ దెబ్బ: చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా చేసిన జగన్ వ్యూహం