విజయవాడ: కృష్ణా జిల్లా రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీమోహన్ రాజీనామా చేయడంతో ఉపఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. వంశీ రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే ఆమోదం పొందిన నాటి నుంచి ఆరు నెలల్లోగా ఉపఎన్నిక జరగాల్సి ఉంది. 

అయితే ఉపఎన్నిక అనేది అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి పెద్ద సవాల్ అని చెప్పుకోవాలి. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇరు పార్టీలకు అగ్ని పరీక్షే.  ఉపఎన్నిక ఫలితాన్ని నిర్దేశించిది సామాజిక వర్గాల ఓట్లు. 

గన్నవరం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు విజయాన్ని నిర్దేశిస్తాయి. క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్ర‌బావం ఎక్కువ‌గా ఉన్న కీల‌కమైన నియోజ‌క‌వర్గాల్లో గన్నవరం నియోజకవర్గం ఒకటి. 

అంతేకాదు అంతర్జాతీయ వినామాశ్ర‌యం ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కూడా ఇదే కావడంతో గన్నవరం రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. అలాగే రైతాంగం కూడా ఎక్కువగానే ఉన్నారు. వారు కూడా ఎన్నికల ఫలితాలను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తారు. అందుకే  నియోజకవర్గంలో రాజ‌కీయాల‌ను రైతుల‌ను విడ‌దీసి చూసే ప‌రిస్థితి కూడా లేదు. 

అలాంటి కీలకమైన గన్నవరం నియోజ‌క‌వ‌ర్గంలో ఉపఎన్నిక‌లు వచ్చే అవకాశం ఉండటంతో రాజకీయ పోరు కనిపించే అవకాశం ఉంది. అంతేకాదు గన్నవరం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఉపఎన్నిక జరనుండటం కూడా విశేషం. 
 
2014, 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీమోహన్ ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ నడిచినప్పటికీ తట్టుకుని మరీ గెలుపొందారు వల్లభనేని వంశీమోహన్. దాంతో ఉపఎన్నికల్లో వల్లభనేని వంశీమోహన్ ప్రభావం కూడా కాస్త కనిపించే అవకాశం ఉంది. 

అయితే ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో వైసీపీకి ఉపఎన్నికలో గెలుపు పార్టీ పనితీరుకు రెఫరెండంగా భావిస్తే ఓటమి మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా టీడీపీ చెప్పుకునే అవకాశం ఉంది. 

వాస్తవానికి రాష్ట్రంలో వచ్చే ఏ ఉపఎన్నికలో అయినా అధికారంలో ఉన్న పార్టీయే గెలుపొందడం సహజంగా జరుగుతూ వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఉపఎన్నికల్లోనూ, అంతెందుకు కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నికల్లోనూ తాజాగా హుజూర్ నగర్ నియోజకవర్గంలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. 

ఇకపోతే అధికారంలోకి వచ్చిన ఐదు నెలల సమయంలోనే ఐదు లక్షల ఉద్యోగాలను ఇవ్వడంతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు సీఎం జగన్. వైయస్ఆర్ రైతు భరోసా, అమ్మ ఒడి, పోలీసులకు వీక్లీ ఆఫ్, వైయస్ఆర్ అభయహస్తం వంటి కీలక పథకాలతో జగన్ ప్రభుత్వం దూసుకుపోతుంది. 

ఉపఎన్నికల్లో ఇవే ప్రచారాస్త్రాలుగా చూసుకుంటూ పోతే తమ ప్రభుత్వానికి ప్రజలు మంచి మార్కులే వేస్తారని వైసీపీ భావిస్తోంది. సెంటిమెంట్ తోపాటు ప్రభుత్వం పనితీరు కూడా వైసీపీకి కలిసి వస్తుందని భావిస్తోంది. 

ఇకపోతే చంద్రబాబు నాయుడు సైతం గన్నవరం నియోజకవర్గం ఉపఎన్నికల్లో గెలుపొందాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. వంశీ రాజీనామా చేయకముందే పదిమంది అభ్యర్థుల జాబితా రెడీ చేసేశారు చంద్రబాబు నాయుడు. 

అంటే ఎన్నికలకు వైసీపీ కంటే కాస్త ముందుగానే రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌, ఇసుక కొరత అంశం, రాజధానిపై స్పష్టమైన క్లారిటీ లేకపోవడం, పోలవరం ప్రాజెక్టు, రివర్స్ టెండరింగ్ వంటి అంశాలు తమకు కలిసివస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. 

మెుత్తానికి గన్నవరం నియోజకవర్గం ఉపఎన్నిక వైసీపీ, టీడీపీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి అని చెప్పుకోవాలి. గెలుపుకోసం ఇరు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తాయనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.