వైసిపి ఎంఎల్ఏలపై టిడిపి ఒత్తిళ్ళు

First Published 6, Jan 2018, 11:13 AM IST
TDP offering attractive packages to prospective defectors
Highlights
  • వైసిపి ఎంఎల్ఏలకు గాలమేయటంలో టిడిపి జోరు పెంచుతోంది.

వైసిపి ఎంఎల్ఏలకు గాలమేయటంలో టిడిపి జోరు పెంచుతోంది. ఇప్పటి వరకూ ప్రోత్సహించిన ఫిరాయింపులు ఒక ఎత్తేతే రాబోయే కాలంలో చేయబోయే ఫిరాయింపులు ఒక ఎత్తు. అందుకు కారణం త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలే. వచ్చే మార్చిలో రాజ్యసభ స్ధానాలు ఖాళీ అవుతాయి. ఏపికి దక్కే మూడు సీట్లలో టిడిపికి 2 స్ధానాలు ఖాయం. వైసిపికి ఒక స్ధానం దక్కే అవకాశం ఉంది.

ప్రస్తుత లెక్కల ప్రకారం రాజ్యసభకు ఎన్నికలు జరిగితే ప్రతీ స్ధానానికి 46 ఓట్లు కావాలి. ప్రస్తుతానికి వైసిపికి ఉన్నది 45 మంది ఎంఎల్ఏలే. అయితే, మొదటి ప్రాధాన్యత ఓట్ల రూపంలో 45 మంది ఎంఎల్ఏల బలం సరిపోతుంది. 45 మంది కచ్చితంగా వైసిపి అభ్యర్ధికే ఓట్లు వేయాలి. ఏ ఒక్క ఓటు మిస్ అయినా వైసిపి అభ్యర్ధి ఓడిపోవటం ఖాయం. అదేవిధంగా మార్చిలోగా వైసిపి నుండి టిడిపి ఒక్క ఎంఎల్ఏని లాక్కున్నా రాజ్యసభ ఎన్నకల్లో ప్రతిపక్షం పోటీ చేయటమే  అనవసరమే.

ఇక, టిడిపి సంగతి చూస్తే 2 స్ధానాల్లో గెలుచుకునేంత బలం అధికారపార్టీకి ఉంది. అయితే, తమకు సరిపడా బలం ఉందన్న విషయాన్ని పక్కనబెట్టిన చంద్రబాబు వైసిపిని దెబ్బ కొట్టటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అందుకనే మార్చి నెలలోగా ఎంతమందిని వీలైతే అంతమందినీ వైసిపి నుండి లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు.  అందులో భాగంగానే గుంటూరుకు చెందిన 2 ఎంఎల్ఏల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట.

గుంటూరు జిల్లానే ఎందుకంటే రాజధాని జిల్లా కాబట్టే. గుంటూరు తూర్పు ఎంఎల్ఏ ముస్తాఫా, బాపట్ల ఎంఎల్ఏ కోన రఘుపతిని టిడిపిలోకి లాక్కోవాలని టిడిపి నేతలు తెగ ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరితోనూ టిడిపి నేతలు ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారట. రఘుపతి గనుక టిడిపిలోకి వస్తే టిటిడి బోర్డు సభ్యత్వంతో పాటు భారీ క్యాష్ కూడా ఆఫర్ చేసారట. ముస్తాఫాకు కూడా కాస్త అటు ఇటుగా అటువంటి ఆఫరే వచ్చిందని సమాచారం. అయితే, తమకు టిడిపిలోకి చేరే ఉద్దేశ్యం లేదని చెప్పారట. వారు చెప్పిన సమాధానంతో వాళ్ళని వదిలేస్తుందో లేకపోతే వేలంపాటలో లాగ ఆఫర్ల పాట పెంచేస్తుందో చూడాలి.

 

 

 

loader