తెలుగుదేశం పార్టీలోో మరో విషాదం నెలకొంది. ఆ పార్టీ కేంద్ర కార్యాలయ ఆహ్వాన కమిటీ కన్వీనర్ కుమారస్వామి హటాన్మరణం చెందాడు. ఆయన మృతికి టిడిపి చీఫ్ చంద్రబాబు సంతాపం తెలిపారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ ఆహ్వాన కమిటీ కన్వీనర్ వల్లూరి కుమార స్వామి మృతితో టిడిపిలో విషాదం నెలకొంది. ఈ క్రమంలో పార్టీ కార్యాలయంలో కుమారస్వామితో పాటు మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు చిత్రపటాల వద్ద టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు ఇతర టిడిపి నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ కార్యాలయంలోకి వెళ్లగానే మొదటగా తాను కుమార స్వామినే కలిసేవాడినని గుర్తుచేసుకున్నారు. అందరికీ సంతృప్తి కలిగేలా కుమార స్వామి తన విధులు నిర్వహించేవారని అన్నారు. ఆఫీస్ కి వచ్చిన ప్రతి కార్యకర్తను ఆయన ఆదరించేవారని అన్నారు. అలాంటిది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అకాల మరణం చెందడం చాలా బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు.
''1994 నుంచి కుమార స్వామి టిడిపి పార్టీలో ఉన్నారు. 2020 నుంచి ఆహ్వాన కమిటీలో ఎంతో బాధ్యతగా కుమార స్వామి పని చేశారు. కుమార స్వామి తండ్రి సుబ్బారావు గుంటూరు జిల్లా అధ్యక్షునిగా కూడా పని చేశారు. కుమారస్వామి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది'' అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
''ఆహ్వాన కమిటీని బలోపేతం చేయాలని మేము ఎన్నో ఆలోచనలు చేసాము. ఇలాంటి సమయంలో కుమార స్వామి మరణం పార్టీకి తీరని లోటు. ఇప్పటికయితే పార్టీ కార్యాలయంలో అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండడానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తాం'' అని చంద్రబాబు వెల్లడించారు.
ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... కుమార స్వామి మృతి పార్టీ కి తీరని లోటని అన్నారు. కుమార స్వామితో తనకు ఎంతో అనుబంధం వుందని... ఆహ్వాన కమిటీ ద్వారా ఆయన అందరికీ దగ్గర అయ్యారని పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంపై వైసీపీ దాడి సమయంలో ఆయన అడ్డుపడే ప్రయత్నం చేశారని గుర్తుచేసారు. ఇలా పార్టీకోసం కమిట్ మెంట్ తో పనిచేసే నాయకుడిని కోల్పోయామని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేసారు.
