పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు కోసం తెలుగుదేశం పార్టీ మరోసారి ఆందోళనకు సిద్ధమైంది. ఉదయం పార్లమెంట్ ప్రారంభమైన తర్వాత సభ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు.

ఎంపీలు అశోక్ గజపతి రాజు, టీజీ వెంకటేశ్, మురళీమోహన్, శివప్రసాద్, కనకమేడల, కొనకళ్ల నారాయణ, గల్లా జయదేవ్ ఆందోళనలో పాల్గొన్నారు. మరోవైపు తిత్లీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళానికి కేంద్రం విడుదల చేసిన సాయంపై చర్చించాలంటూ రూల్ 377 కింద ఎంపీ రామ్మోహన్ నాయుడు నోటీసు ఇచ్చారు.