రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలిశారు. రాష్ట్రంలో గత 13 నెలలుగా ఏపీలో పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై వారు రాష్ట్రపతికి వివరించారు.

అనంతరం టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అందుకే తాము రాష్ట్రపతిని కలిసి అన్ని విషయాలు వివరించామన్నారు. రాష్ట్రాన్ని కాపాడాలని రాష్ట్రపతిని కోరామని, దీనికి రామ్‌నాథ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Also Read:భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయాలి: కడప ఎస్పీతో ఏవీ సుబ్బారెడ్డి భేటీ

దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని టీడీపీ ఎంపీలు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని, ఆయనకు అనుకూలంగా వుండే విధంగా మలుచుకుంటున్నారని మండిపడ్డారు.

తెలుగుదేశం నేతలపై కక్షపూరితంగా దాడులు చేయడంతో పాటు ప్రజల ప్రాథమిక హక్కులు కాలరాస్తున్నారని వారు ఎద్దేవా చేశారు. రాజ్యాంగ హోదాల్లో ఉన్న వారు సంస్థలపై దాడులు, పేదల భూములు లాక్కోవడం, ప్రతిపక్షాలకు చెందిన వారిపై హింస, దౌర్జన్యాలు, ఆస్తుల ధ్వంసం చేస్తున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని టీడీపీ నేతలు తెలిపారు.