పార్లమెంట్‌లో బీజేపీ, వైసీపీల బండారం బయటపెడతాం: టీడీపీ

TDP MP's slams on Bjp in delhi
Highlights

లోక్‌సభలో అవిశ్వాస తీర్మాణానికి మద్దతుగా నిలిచిన పార్టీలకు  టీడీపీ ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు.ఏపీ రాష్ట్ర ప్రయోజనాల ను  పార్లమెంట్‌ వేదికగా విన్పిస్తామని  టీడీపీ ఎంపీలు ప్రకటించారు.  


న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మాణానికి మద్దతుగా నిలిచిన పార్టీలకు  టీడీపీ ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు.ఏపీ రాష్ట్ర ప్రయోజనాల ను  పార్లమెంట్‌ వేదికగా విన్పిస్తామని  టీడీపీ ఎంపీలు ప్రకటించారు.  వైసీపీ కేంద్రంతో కుమ్మకైందని టీడీపీ ఎంపీలు విమర్శలు గుప్పించారు.

పార్లమెంట్‌ లో అవిశ్వాసాన్ని చర్చకు స్వీకరిస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించిన తర్వాత  టీడీపీ ఎంపీలు  బుధవారం నాడు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని తెలిసే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు, రైల్వేజోన్‌, రాజధాని నిర్మాణం సహా మొత్తం 14 అంశాలపై సభలో మాట్లాడుతామన్నారు.

టీడీపీ సాధించిన విజయం: నారాయణ

కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై చర్చ తీసుకోవడం  టీడీపీ సాధించిన విజయమని  ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలను అమలు చేయని విషయాన్ని  పార్లమెంట్ వేదికగా రుజువు చేస్తామని ఆయన చెప్పారు. బీజేపీ, వైసీపీ వైఖరిని లోక్‌సభ సాక్షిగా ఎండగడతామని తెలిపారు. బీజేపీ మద్దతుతోనే విభజన బిల్లు ఆమోదంపొందిందని గుర్తుచేశారు. 

వైసీపీ ఎంపీ నాటకాలు బట్టబయలు చేస్తాం: నక్కా ఆనంద్ బాబు

 వైసీపీ ఎంపీల రాజీనామాల నాటకాలు ఈరోజు పార్లమెంటు సమావేశాల్లో బట్టబయలు అవుతాయని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. మోదీకి భయపడి పార్లమెంట్ మెట్లు ఎక్కడానికి వైసీపీ నేతలు భయపడుతున్నారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.32 కోట్లతో 150 ఇన్నోవా, 50 బోలెరో వాహనాలు అందజేశామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.


 పార్టీలకు ధన్యవాదాలు: టీడీపీ ఎంపీలు
టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు తెలిపిన పార్టీలకు టీడీపీ ఎంపీలు తోట నర్సింహం, సుజనా, సీఎం రమేష్‌ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంపై దేశ ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో అవిశ్వాసంపై చర్చతో బయటపడుతోందన్నారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై నిలదీసే అవకాశం లభించిందని ఎంపీలు పేర్కొన్నారు.

loader