సీఎం రమేష్ దీక్షను హేళన చేస్తూ టీడీపీ ఎంపీల జోకులు ఇవీ...

TDP MP's funny conversation over CM Ramesh hunger strike
Highlights

బరువు తగ్గాలంటే దీక్షలంటూ టీడీపీ ఎంపీల సరదా వ్యాఖ్యలు


అమరావతి:కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌కు కలిసేందుకు వెళ్లిన సమయంలో టీడీపీ ఎంపీల సరదా వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. అసలు టీడీపీ ఎంపీలు  ఏం మాట్లాడుకొన్నారనే విషయమై ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓ తెలుగు టీవీ న్యూస్ చానెల్  ఎంపీ సరదా సంభాషణను ప్రసారం చేసింది.బరువు తగ్గేందుకు దీక్షలు చేద్దామనుకొంటున్నామంటూ ఎంపీలు సరదాగా చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే తమకు అనుకూలంగా ఎడిటింగ్ చేసి మీడియా ప్రసారం చేసిందని టీడీపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు.


కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌ను కలిసేందుకు వెళ్లిన సమయంలో టీడీపీ ఎంపీలు  కొందరు  సరదాగా సీఎం రమేష్ దీక్షపై వ్యాఖ్యలు చేశారు.  బరువు తగ్గాలంటే ఆమరణ నిరహారదీక్షలు చేయాలని అభిప్రాయపడ్డారు. దీక్షలపై సెటైర్లు వేసుకొన్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీల తీరును తప్పుబట్టారు. ఎంపీలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. 

తాను  ఐదు కిలోల బరువు తగ్గాలని భావిస్తున్నానని ఎంపీ మురళీమోహన్ అన్నారు. అయితే  తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. అయితే వారం రోజుల పాటు తాను  దీక్ష చేసేందుకు సిద్దమన్నారు. దీంతో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కల్పించుకొన్నారు.  ఈయనను  పెడదామంటూ డన్ అంటూ సెటైర్ వేశారు.  అయితే  మరో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కల్పించుకొన్నారు. ఆయనను  మొదటిరోజునే రామ్‌ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈయనెందుకు  అని రవీంద్రకుమార్ అనగానే  శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడ అవును అన్నారు.దీంతో ఎంపీలంతా నవ్వారు. ఇదే  వీడియోలో అనకాపల్లి ఎంపీ ఆవంతి శ్రీనివాస్  జోనూ లేదు గీనూ లేదు అంటూ  వ్యాఖ్యానించడం విన్పించింది. 

అయితే ఈ వీడియోను ప్రసారం చేసిన న్యూస్‌ చానెల్‌కు ఆవంతి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు.  రైల్వేజోన్ విషయంలో తన చిత్తశుద్దిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. ఈ వీడియోను కట్ అండ్ పేస్ట్ చేసి తమకు రాజకీయంగా ఇబ్బందికలిగేలా చేశారని ఆయన ఆరోపించారు. ఎన్డీఏలో టీడీపీ ఉన్న కాలంలోనే తాను రైల్వేజోన్ కోసం దీక్ష చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 


 

loader